తిలక్ వర్మ ఆటకు ఫిదా అయ్యానన్న సచిన్ టెండూల్కర్.. మనోడు మామూలు ప్లేయర్ కాదట..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2022 సీజన్లో ముంబై ఇండియన్స్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్.. ఈసారి మాత్ం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి మరిచిపోలేని అనుభవాన్ని పొందింది. లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న రోహిత్ శర్మ ఈసారి తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. లీగ్‌లో తొలి ఎనిమిది మ్యాచ్‌లను ఓడిపోయి భారీ అప్రదిష్ట మూటగట్టుకుంది.
అయితే సెకండాఫ్ లో మాత్రం 6 మ్యాచుల్లో నాలుగు గెలిచి మళ్లీ పుంజుకుంది. ఇక ముంబై ఇండియన్స్ ఈసారి నిరాశపరిచినప్పటికీ ఆ జట్టుకు భవిష్యత్తులో రాణించదగ్గ కొందరు ప్లేయర్లు దొరికారు. అందులో చెప్పుకోదగ్గ ప్లేయర్ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. అతన్ని ముంబై మాజీ కెప్టెన్, మెంటార్ సచిన్ టెండూల్కర్ సైతం ఇటీవల ప్రశంసించాడు.

అరంగేట్రంలోనే తిలక్ అదుర్స్
19ఏళ్ల తిలక్ వర్మ ఈ సీజన్లో అప్రతిహతంగా ముంబై తరఫున పోరాడాడు. ఓ వైపు సీనియర్లు తడబడుతూ ఆడుతుంటే స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించాడు. అంది వచ్చిన అవకాశాన్ని తిలక్ సద్వినియోగపరుచుకున్నాడు. ఈ సీజన్‌లో అరంగేట్రం చేసిన తిలక్ 131.02 స్ట్రైక్ రేట్‌తో 14ఇన్నింగ్స్‌లలో 397పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్లో ఇషాన్ కిషన్ తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరఫున మెంటార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సచిన్ తాను నిర్వహించిన ప్రీ-సీజన్ క్యాంప్‌లో తిలక్ వర్మ ఎంతో ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు.

తిలక్ ప్రామిసింగ్ క్రికెటర్
సచిన్ మాట్లాడుతూ.. తిలక్ వర్మ ఓ ప్రామిసింగ్ క్రికెటర్. టోర్నీ ప్రథమార్థంలో నేను అతనితో చాలా సార్లు మాట్లాడాను. అతని బ్యాటింగ్ గురించి కూడా కొంత పరిశీలన చేశాను. అతను చాలా పాజిటివ్ ప్లేయర్. చాలా స్పష్టంగా, సులువుగా అతని బ్యాటింగ్ మనస్తత్వం ఉంటుంది. అతను ముంబై ఇండియన్స్ కోసం ట్రయల్ గేమ్‌లు ఆడటం చూసినప్పుడు నేను అతని ఆట పట్ల చాలా ఇంప్రెస్ అయ్యాను అని టెండూల్కర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. ఇక తిలక్ మంచి ఆఫ్ స్పిన్నర్ కూడా అని టెండూల్కర్ చెప్పాడు. అయితే ఈ సీజన్‌లో తిలక్ వర్మ కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఈ సీజన్ మొత్తంలో తిలక్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఎలాంటి వికెట్లు తీయలేదు. ఇక అతను దేశవాళీ క్రికెట్లో బౌలింగ్ తో కూడా మంచి కంట్రిబ్యూషన్ ఇస్తాడు.

అద్భుతమైన భవిష్యత్తు ఉంది
ఇక సచిన్ అతని ఫీల్డింగ్ గురించి, రన్ అప్ గురించి మాట్లాడుతూ.. అతను చాలా ఫిట్‌గా ఉంటాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తగలడు. ఇక అతను ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. తిలక్ ఈ సీజన్లో పెద్దగా బౌలింగ్ చేయలేదు. అయినప్పటికీ అతను తన బౌలింగ్ గురించి ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదని నేను చెబుతాను. అతను టీ20 క్రికెట్లో జట్టుకు అవసరమయినప్పుడు ఒకట్రెండు ఓవర్లు వేయగలిగేలా ఉండాలి. మొత్తంమీద నాకు అయితే అతని ఆట బాగా నచ్చింది. అతను మామూలు ప్లేయర్ కాదు. చాలా హర్డ్ వర్క్ చేయగలడు. అతను ఇలాగే తన ఫాంను మున్ముందు కొనసాగించాలని కోరుకుంటున్నా. తప్పకుండా అతనికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది అని సచిన్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications