హైదరాబాద్: మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఓ అద్బుతమైన కానుకను బహుమతిగా ఇచ్చాడు. ఇంతకీ సచిన్ ఇచ్చిన ఆ బహుమతి ఏంటో తెలుసా? బీఎమ్‌డబ్ల్యూ 730ఎల్‌డీ కారు. ఈ కారు విలువ భారత్‌లో సుమారు రూ.1.14కోట్లు.
సచిన్ నుంచి అందుకున్న బహమతితో ఫోటో దిగిన సెహ్వాగ్ దానిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'థ్యాంక్యూ సచిన్ పాజీ' అంటూ సచిన్ ఇచ్చిన కారుతో ఫోటో దిగి సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో కామెంట్ పోస్టు చేశాడు.
సచిన్‌తో సెహ్వాగ్‌కు ఉన్న అనుబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఓపెనర్లుగా వీరిద్దరూ భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలను అందించారు. సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సమయంలో 'అతనో నిజమైన ఛాంపియన్' అని సచిన్ కొనియాడిన సంగతి తెలిసిందే.
2002 నుంచి 2012 మధ్య కాలంలో సెహ్వాగ్, సచిన్‌ల జోడీ 93 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనర్లుగా బరిలోకి దిగారు. వీరిద్దరూ భారత్‌కు 12 సెంచరీలు భాగస్వామ్యాలతో పాటు 18 హాఫ్ సెంచరీల భాగస్వామ్యాలను నమోదు చేశారు. వీరిద్దరూ కలిసి 3919 పరుగులు నమోదు చేశారు.
సెహ్వాగ్ కూడా సచిన్ టెండూల్కరే తనకు స్ఫూర్తి అని, మైదానంలో మంచి స్నేహితుడని తరచూ చెబుతుంటడాన్ని మనం ఎన్నో సార్లు చూశాం.