హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్వయంగా నటించిన బయోపిక్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త. సచిన్ టెండూల్కర్ నటించిన 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమాను త్వరలోనే వెండి తెరపై చూడొచ్చు.
తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' విడుదల తేదీని మాస్టర్ ట్విటర్‌లో సోమవారం ప్రకటించాడు. 'ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఇప్పటివరకూ అడుగుతూ వచ్చిన ప్రతీ అభిమాని ప్రశ్నకు ఇదే నా సమాధానం. మే 26వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఆ డేట్‌ను క్యాలెండర్ లో మార్కు చేసుకోండి లేకపోతే సేవ్ చేసుకోండి' అని సచిన్ ట్వీట్ చేశాడు.

ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ ఎర్సికిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సచిన్ టెండూల్కర్ తన పాత్రను తానే పోషించాడు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి మొదటి పోస్టర్‌ను ఏప్రిల్ 2016లో విడుదల చేశారు.
ఈ చిత్రంలో సచిన్ యువకుడిగా ఉన్న సన్నివేశాల్లో అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ నటించనుండటం మరో విశేషం. గతేడాది విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. సచిన్ స్వయంగా నటించిన సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.