భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. సచిన్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ తన చిరకాల స్నేహితురాలు సానియా చందోక్‌తో ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో సచిన్ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొడుకు పెళ్లిపై సచిన్ ఏమన్నారంటే..?
ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక వీడియోలో.. సచిన్ తన కుమారుడి వివాహం గురించి మనసు విప్పి మాట్లాడారు. "మాకు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఒక కొడుకు తను ఇష్టపడిన అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేశాడంటే.. వాడు పెరిగి పెద్దవాడయ్యాడని అర్థం. అర్జున్, సానియాలు ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటున్నారు. అర్జున్, నీ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. నిన్ను ఎంతగానో ప్రేమించే ఒక ప్రత్యేకమైన వ్యక్తి నీకు దొరకడం చాలా సంతోషంగా ఉంది" అని సచిన్ భావోద్వేగంతో చెప్పారు.

ఎవరీ సానియా చందోక్?
అర్జున్ టెండూల్కర్ భార్య కాబోతున్న సానియా చందోక్ కేవలం ఒక సెలబ్రిటీ కోడలు మాత్రమే కాదు.. ఆమెకు స్వయం గుర్తింపు కూడా ఉంది. సానియా ఓ పారిశ్రామికవేత్త, ప్రొఫెషనల్ వెటర్నరీ టెక్నీషియన్. జంతువుల సంరక్షణ కోసం ఆమె 'Mr. Paws Pet Spa & Store LLP' అనే సంస్థను స్థాపించారు. 2020లో ప్రతిష్టాత్మకమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె గ్రావిస్ గ్రూప్ ఛైర్మన్ రవి ఘాయ్ మనవరాలు. ఆమె తల్లిదండ్రులు సన్నీ, గౌరికా కూడా అదే సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్నారు.
మార్చి 5న వివాహం
అర్జున్, సానియాల వివాహం మార్చి 5వ తేదీన ముంబైలో అత్యంత వైభవంగా జరగనుంది. ఇప్పటికే టెండూల్కర్ కుటుంబం భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను కలిసి వివాహానికి ఆహ్వానించారు. జామ్‌నగర్‌లో జరిగిన ఈ ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు అంబానీ కుటుంబం ఆతిథ్యం ఇవ్వడం విశేషం.
క్రికెట్ ప్రపంచంలో 'గాడ్ ఆఫ్ క్రికెట్'గా పిలవబడే సచిన్, ఒక తండ్రిగా తన కొడుకు ఎదుగుదలను చూసి మురిసిపోతుండటం అభిమానులను ఆకట్టుకుంటోంది. అర్జున్-సానియాల జంటకు నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.