
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. అభిమానులను మాత్రం అలరిస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మాస్టర్ బ్లాస్టర్.. తనకు సంబందించిన విషయాలను షేర్ చేసుకుంటుంటాడు. సచిన్‌కు క్రికెట్ ఆటతో పాటు వంట పట్ల మక్కువ ఎక్కువ అనే సంగతి తెలిసిందే. గతంలో పలుమార్లు కిచెన్‌లోకి దూరి అనేక రకాల వెరైటీలు చేసిన సచిన్.. తాజాగా మరోసారి మాస్టర్ చెఫ్ అవతారం ఎత్తాడు. తన మిత్రుల కోసం ఓ రుచికరమైన వంటకం సిద్ధం చేశాడు. అయితే ఆ వంటకం ఏంటో తనకే తెలియదని చెప్పడం విశేషం.
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం సచిన్ టెండూల్కర్ కుటుంబంతో గడుపుతున్న విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్ పుణ్యమాని సచిన్ ఇంట్లోంచి బయటకు వెళ్లడం లేదు. పూర్తి సమయం కుటుంబ సభ్యులతోనే గడుపుతున్నాడు. కాలక్షేపం కోసం అప్పుడప్పుడు ఇంటి పనులు కూడా చేస్తున్నాడు. తోటలో మొక్కలకు నీరు పెట్టడం, పండిన పండ్లను తెంపి రుచి చూడడం, సరదాగా క్రికెట్ ఆడడం చేస్తున్నాడు. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ వంటగదిలోకి ప్రవేశించాడు. తన వంటకు సంబందించిన వీడియోను శుక్రవారం సాయంత్రం సచిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకున్నాడు.
తన మిత్రుల కోసం వంట చేస్తున్నానని సచిన్ టెండూల్కర్ వీడియోలో చెప్పాడు. 'అందరికీ ఇదో సర్‌ప్రైజ్. నేను ఏం వండుతున్నానో ఎవరికీ తెలియదు. నిజం చెప్పాలంటే నాకూ తెలియదు. అందుకని నేనేం బాధపడటం లేదు. ఇప్పుడు బ్యాట్స్‌మన్ నిలదొక్కుకున్నాడు (వంటకం తయారవుతుండగా). ఇక బౌలర్లు వారిని వారే రక్షించుకోవాలి. ఎందుకంటే ఈ కళలో నేను ఆరితేరాను. ఇందుకు కొంచెం సమయం కావాలంతే' అని సచిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరో వీడియోలో భారత క్రికెట్ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌కు సచిన్ బర్త్ డే విషెష్ చెప్పాడు. గవాస్కర్‌కు శుభాకాంక్షలు చెబుతూ పూర్తి ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించాడు. ఈ సందర్భంగా ఆయనతో గడిపిన క్షణాలను సచిన్ గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ తొలినాళ్లలో ఆ దిగ్గజ బ్యాట్స్‌మన్ చెప్పిన మాటలను నెమరువేసుకున్నాడు. దాంతో తన ఆట మారిందని, ఆ మాటలను తన కెరీర్‌లో ఎల్లవేళలా పాటించానని చెప్పాడు. సచిన్ భారత్ తరఫున 200 టెస్టులు, 463 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు.