
హైదరాబాద్: నాలుగోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత యువ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గతంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో అండర్-19 వరల్డ్‌కప్‌ను నాలుగోసారి గెలిచి పృథ్వీ షా నేతృత్వంలోని యువ భారత జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు అండర్-19 జట్టు కోచ్ ద్రవిడ్‌తో పాటు యువ జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఫైనల్లో ఆత్మవిశ్వాసంతో, అత్యంత క్రమశిక్షణతో పరిపూర్ణ విజయం సాధించేలా యువ క్రికెటర్లను తీర్చిదిద్దిన అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ పనితీరును కూడా మెచ్చుకుంటున్నారు. మౌంట్ మాంగన్యూ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారత్ జట్టుపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు.
గొప్ప టీమ్ వర్క్‌తోనే పెద్ద లక్ష్యాలను అందుకోగలమని సచిన్ పేర్కొన్నాడు. ప్రపంచ ఛాంపియన్లను చూసి దేశం గర్వపడుతోందని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. 'యువ క్రికెటర్లకు సరైన మార్గనిర్దేశం చేసిన కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ పారస్‌కు ప్రత్యేక అభినందనలు' అని ట్వీట్ చేశాడు.
భవిష్యత్తులో ఇదే ఆటతీరు కనబరిచి యువ క్రికెటర్లు మరిన్ని మంచి విజయాలు నమోదు చేయాలని ఆశిస్తున్నట్లు సచిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫైనల్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 217 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 38.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి భారత్ చేధించింది. రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో పృథ్వి షా సేన ఓ ఛాంపియన్ జట్టులా ఆడింది.
అంతకముందు 2000, 2008, 2012లలో టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. 2000లో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో, 2008లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో, 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. తాజాగా పృథ్వి షా నేతృత్వంలో ఆస్ట్రేలియాపై గెలిచి రికార్డు స్థాయిలో నాలుగోసారి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే టోర్నీలో ఛాంపియన్ ప్రదర్శన కనబర్చిన అండర్-19 యువ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, ఒక్కో జట్టు సభ్యుడికి రూ. 30 లక్షలు, ఇక సపోర్టింగ్ స్టాఫ్‌కు రూ. 20 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది.