
మైలోస్టోన్ రికార్డు
సరిగ్గా 11 సంవత్సరాల క్రితం సచిన్ టెండూల్కర్ టెస్ట్ ఫార్మాట్‌లో డిసెంబర్ 19న ఎవరు అందుకోలేని మైల్ రాయిని చేరుకున్నాడు. 2010 డిసెంబర్ 19వ తేదీన సచిన్ టెస్టు క్రికెట్‌లో 50వ సెంచరీని సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్‌లో 50 సెంచరీలు చేసిన ఒకే ఒక్కడిగా సచిన్ రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాలోని సెంచురియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఈ రికార్డును సాధించాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియాలోని మిగతా ఆటగాళ్లు అంతగా రాణించకపోయినా సచిన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌తోపాటు రెండో ఇన్నింగ్స్‌లోను భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

టీమిండియా ఫేలవ ప్రదర్శన
2010లో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచురియన్ వేదికగా డిసెంబర్ 16 నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. బ్యాటర్ల ఫేలవ ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే ఆలౌటైంది. 36 పరుగులతో సచిన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధోనీ 33, హర్బజన్ 27 పరుగులు చేయగా.. మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో మోర్కెల్ 5, స్టెయిన్ 3, కలిస్ ఒక వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 620 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టులో కలిస్(201*) డబుల్ సెంచరీతోపాటు ఆమ్లా(140), డివిల్లియర్స్(129) సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో భజ్జీ, ఇషాంత్ రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం 484 పరుగుల భారీ లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్ల సెహ్వాగ్(63), గంభీర్(80) హాఫ్‌సెంచరీలతో మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 137 పరుగులు జోడించారు. ఆ తర్వాత ద్రావిడ్ 43, ఇషాంత్ 23, లక్ష్మణ్ 7 పరుగులు చేశారు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ చెలరేగారు. ఈ క్రమంలో సచిన్ టెస్టుల్లో 50వ సెంచరీ పూర్తి చేసుకోగా, ధోని 90 రన్స్ చేసి ఔటయ్యాడు. అయితే సచిన్ చివరి వరకు 111 పరుగులతో అజేయంగా నిలిచినప్పటికీ మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. సచిన్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. కాగా ఆ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.

అత్యధిక సెంచరీలు చేసింది వీళ్లే
టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 45 సెంచరీలతో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్ రెండో స్థానంలో ఉన్నాడు. అనంతరం 41 సెంచరీలతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్, 38 సెంచరీలతో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కర మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.


Click it and Unblock the Notifications












