లండన్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది! తన పట్ల, తన కుటుంబం పట్ల బ్రిటిష్ ఎయిర్ వేస్ తీరును సచిన్ టెండుల్కర్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా అసహనం ప్రకటించారు. ఆగ్రహం, అసంతృప్తి, ఒత్తిడికి లోనయ్యామన్నారు.
ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సచిన్‌కు చిరాకు కలగడం గమనార్హం. ఎప్పుడూ నవ్వుతూ కనిపించి సచిన్ అందుకు భిన్నంగా బ్రిటిష్ ఎయిర్ వేస్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆల్ స్టార్ క్రికెట్ టోర్నీ కోసం సచిన్ టెండుల్కర్ అమెరికాలో ఉన్నారు.

తన కుటుంబ సభ్యులకు సీట్లు కేటాయించడంలో బ్రిటిష్ ఎయిర్ వేస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ట్విట్టర్ వేదికగా సచినా ఆరోపణలు గుప్పించారు. సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ తన కుటుంబ సభ్యుల టికెట్లు నిర్ధారించకుండా ఆ విమానయాన సంస్థ తమను ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు.
బ్రిటిష్ ఎయిర్ వేస్ వ్యవహార సరళితో తాను అసహనానికే కాక అసంతృప్తి, ఆగ్రహానికి కూడా గురయ్యానని పేర్కొన్నారు. అంతేకాక తన సామానును తాము సూచించిన గమ్యానికి కాకుండా వేరే ప్రాంతానికి తరలించిందన్నారు.
నా పట్ల మీ 'డోంట్ కేర్' వ్యవహార సరళి ఏమీ బాగాలేదన్నాడు. అయితే సచిన్ కామెంట్లపై బ్రిటిష్ ఎయిర్ వేస్ కూడా వేగంగానే స్పందించింది. లగేజీ వివరాలు పూర్తి అడ్రెస్ ఇస్తే అక్కడికే చేరుస్తామని పేర్కొంది. సచిన్‌ను క్షమాపణలు కోరింది.
సచిన్ పూర్తి పేరు చెప్పమన్న బ్రిటిష్ ఎయిర్ వేస్‌కు అభిమానుల కౌంటర్
సచిన్ తన పూర్తి పేరు, వివరాలు అందిస్తే లగేజ్ చేర్చుతామన్న బ్రిటిష్ ఎయిర్ వేస్ పైన ట్విట్టర్లో అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. సచిన్ పూర్తి పేరు తెలియదా అన్న విధంగా వారు స్పందిస్తున్నారు.
మాకు ఒబామా, మోడీ తెలుసునని, అలాగే క్రికెట్ దేవుడు సచిన్ అంతకంటే ఎక్కువ తెలుసునని ఒకరు, సచిన్ పూర్తి పేరు సచిన్ రమేష్ టెండుల్కర్ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఈ పేరు చాలనుకుంటానన్నారు. మోడీ గారూ.. బ్రిటిష్ ఎయిర్ వేస్‌కు సచిన్ పూర్తి పేరు తెలియదంటా అని మరొకరు ట్వీట్ చేశారు.