
హైదరాబాద్: బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఆస్ట్రేలియా పరువు పోయినా... ఆస్ట్రేలియన్ల బుద్ది మాత్రం మారలేదు. ఆస్ట్రేలియా అంటేనే క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు ఛీకొడుతున్న వేళ.. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్ మాత్రం మంగళవారం పుట్టినరోజు జరుపుకొంటున్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌పై సెటైర్ వేసింది.
ఈ ట్వీట్‌కు భారత క్రికెట్ అభిమానులు ధీటుగా స్పందించడంతో.. దెబ్బకు వెనక్కి తగ్గింది. అసలేం జరిగిందంటే... మంగళవారం సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు. అభిమానులంతా సచిన్ పుట్టినరోజు వేడుకల్లో మునిగిపోయారు. ఇదే రోజు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫ్లెమింగ్ పుట్టినరోజు కావడంతో అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఆసీస్ మాజీ బౌలర్ డామియెన్ ఫ్లెమింగ్ బౌలింగ్‌లో సచిన్ క్లీన్ బౌల్డ్ అయిన వీడియో అది. సచిన్ పుట్టిన రోజు నాడు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తన దేశ ఆటగాడికి శుభాకాంక్షలు తెలిపిందుకు ఈ వీడియో పోస్టు చేయడం సరికాదని అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
సచిన్, ఫ్లెమింగ్‌లిద్దరూ ఒకే తేదీన జన్మించినప్పటికీ.. మాస్టర్ బ్లాస్టర్‌ను అవమానించేలా వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోని చూడగానే చిర్రెత్తుకొచ్చిన అభిమానులు... అదే ఫ్లెమింగ్ బౌలింగ్‌లో సచిన్ అద్భుతమైన టైమింగ్‌తో సిక్స్ బాదిన వీడియోను పోస్ట్ చేసి కసి తీర్చుకున్నారు.
అంతేకాదు 'ఈ రోజు సచిన్ పుట్టిన రోజు. తమ దేశ ఆటగాడు ఫ్లెమింగ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పడం కోసం సచిన్‌ను ఔట్ చేసిన వీడియోనే ఎందుకు పెట్టాలి. మరో బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసిన వీడియో పెట్టొచ్చు కదా' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. మరొక నెటిజన్ అయితే 'స్మిత్, వార్నర్ పుట్టిన రోజు నాడు వారు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన వీడియోలు పోస్టు చేయండి' అని ట్వీట్ చేశాడు.
మరొక నెటిజన్ 'క్రికెట్ ఆస్ట్రేలియా షేమ్. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లను గౌరవించడం వారికి తెలియదా?' అని ప్రశ్నించాడు. దీంతో భారత క్రికెట్ అభిమానుల దెబ్బకు ఆ క్రికెట్ ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగినంత పనైంది. ఇప్పటికే పరువు పోవడంతో.. నష్ట నివారణ చర్యలో భాగంగా.. ఆస్ట్రేలియాపై సచిన్ ఆడిన అద్భుత షాట్లతో కూడిన వీడియోను పోస్ట్ చేసి సచిన్‌కు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పింది.