హైదరాబాద్: కొచ్చి పర్యటనలో ఉన్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. గురువారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసేందుకు వెళ్లిన సచిన్ కారులో ప్రయాణిస్తూ దారిలో వెళుతున్న ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పెట్టుకోవాలంటూ సూచించాడు.
కారు విండోలోంచి సచిన్ కనిపించడంతో కొంత మంది అభిమానులు ఉత్సాహంగా హాయ్ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సచిన్ మాత్రం వాళ్లకు 'హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోండి. కేవలం బైక్ నడుపుతున్నవాళ్లు పెట్టుకుంటే సరిపోదు. వెనకాల కూర్చునేవాళ్లు కూడా హెల్మెట్ ధరించాల్సిందే' అని సచిన్ సూచించాడు.

దీనికి రహదారి వెంట వెళ్తున్న బైకర్లు కూడా సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరాన్ని మరోసారి వివరించాడు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో కూడా సచిన్ హెల్మెట్ ధరించాలంటూ అవగాహన కల్పించిన సంగతి తెలిసిందే. ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా కేరళ బ్లాస్టర్స్ జట్టు నవంబర్ 17న కోల్ కతాతో ఆడనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని సచిన్ కోరాడు. కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సచిన్ సహాయజమానిగా ఉన్న సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం సచిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్, ఇనిస్టాగ్రామ్‌లలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఉత్సాహాపరుస్తున్న సంగతి తెలిసిందే.