ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. రెండువందల టెస్టును ఆడిన అనంతరం మాస్టర్ టెస్టులకూ దూరం కానున్నారు. ఇప్పటికే టెండుల్కర్ అంతర్జాతీయ వన్డే, ట్వంటీ20లకు గుడ్ బై చెప్పారు. తాజాగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వెస్టిండిస్‌తో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ముంబై, కోల్‌కతలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టెస్టుల అనంతరం సచిన్ తప్పుకోనున్నారు.
సచిన్ రిటైర్మెంట్ ప్రకటనను భారత్ క్రికెట్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బిసిసిఐ) గురువారం మధ్యాహ్నం ప్రకటించింది. సచిన్ టెండుల్కర్ 200వ టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది.

రిటైర్మెంట్ విషయమై సచిన్ లేఖ రాసినట్లు బిసిసిఐ తెలిపింది. కాగా, సచిన్ టెండుల్కర్ 24 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడారు. వన్డేలు, టెస్టులు, ట్వంటీ20లో ఎన్నో రికార్డులు సృష్టించారు. టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు, సెంచరీలను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఎన్నో రికార్డులు తిరగరాశాడు.
గతంలో వన్డేలు, ట్వంటి20ల నుండి సచిన్ తప్పుకున్నాడు. ఇప్పుడు టెస్టులకు గుడ్ బై చెప్పాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో ఓ మహాధ్యాయం ముగిసింది. సచిన్ 198 టెస్టులు ఆడి 15837 పరుగులు చేశాడు. 463 వన్డేలు ఆడి 18,426 పరుగులు చేశాడు. టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. రెండు ఫార్మాట్లలో కలిపి వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్. వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ సచిన్‌దే.
క్రికెట్ లేని జీవితాన్ని ఊహించుకోలేను: సచిన్
క్రికెట్ లేని జీవితాన్ని తాను ఊహించుకోలేనని సచిన్ టెండుల్కర్ బిసిసిఐకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. క్రికెట్ లేకుండా జీవించడం దుర్భరమే అన్నాడు. తాను 11వ ఏట నుండి క్రికెట్ ఆడుతున్నానని, దేశం తరఫున ఆడటం తన కల అని అది నెరవేరిందన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్పగా భావిస్తున్నట్లు చెప్పాడు.
రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చిందని తన హృదయం చెబుతోందని, అభిమానుల మద్దతు వల్లే ఇన్నేళ్లు ఆడగలిగానని చెప్పాడు. తాను సొంత గడ్డ పైన ఆడనున్న రెండువందలవ మ్యాచ్ పైన దృష్టి పెట్టానని చెప్పాడు. తనకు ఇన్నాళ్లు సహకరించిన బిసిసిఐ, కుటుంబ సభ్యులు, అభిమానులకు కృతజ్ఞతలు అన్నారు.