ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం వేడుకకు దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లికి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తులను ప్రతిష్ఠించనున్న విషయం తెలిసిందే. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
అయోధ్య వేడుకకు ప్రధాని మోదీతో పాటు సుమారు ఆరు వేల మందికి శ్రీరామ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ ఆహ్వానం అందించినట్లు సమాచారం. వారిలో సాధువులు, పూజారులు, రాజకీయ నేతలతో పాటు పలు ప్రముఖులు ఉన్నారు. కాగా, రామమందిరంలో గర్భగుడితోపాటు ఐదు మండపాలు ఉంటాయి. గుధ్ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఉన్నాయి. ఆలయం మొత్తం 8.64 ఎకరాలలో ఉంది.

అయితే అయోధ్య వేడుక జనవరి 22 జరగనుండగా, ఇంగ్లాండ్ తో టీమిండియా టెస్టు సిరీస్ జనవరి 25న ప్రారంభం కానుంది. తొలి టెస్టు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో కోహ్లి అయోధ్య వేడుకకు హాజరైతే, వెంటనే తిరిగి హైదరాబాద్ కు చేరుకోవాల్సి ఉంటుంది.
టెస్టు ఛాంపియన్ షిప్-2025 ఫైనల్ కు అర్హత సాధించాలంటే దక్షిణాఫ్రికా తో పాటు ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. ఇటీవల ప్రారంభమైన టెస్టు ఛాంపియన్ షిప్ లో ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో ఉంది. వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ ల్లో తలపడగా ఒక పోరులో గెలిచింది. మరో మ్యాచ్ ను డ్రా గా ముగించింది.
ఇక, భారత్ క్రికెట్ రూపురేఖలు మార్చిన దిగ్గజ క్రికెటర్లలో సచిన్, విరాట్ కోహ్లి ప్రముఖులు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా సచిన్ 100 శతకాలతో చరిత్ర సృష్టించాడు. 80 సెంచరీలతో విరాట్ కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. అయితే వన్డే ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు కోహ్లి. విరాట్ 50, సచిన్ 49 సెంచరీలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.