ముంబై/హైదరాబాద్: ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకున్న సానియా మీర్జాకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తు టెన్నిస్ క్రీడాకారులకు సానియా స్ఫూర్తిగా నిలుస్తుందంటూ కంగ్రాట్స్ చెప్పారు.
నిన్న సైనా నెహ్వాల్, నేడు సానియా మీర్జా.. భారత మహిళలు నెంబర్ వన్ స్థాయికి దూసుకెళ్లి మనల్ని గర్వపడేలా చేస్తున్నారని కోహ్లీ రెండు రోజుల ముందు ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా సానియాకు శుభాకాంక్షలు తెలిపారు.
యావత్ దేశం గర్వపడేలా చేశావని సానియా మీర్జాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభినందించారు. సానియా మీర్జా నిబద్ధత, పట్టుదలను ఎంతో ప్రశంసించారు. నెంబర్ వన్ ర్యాంక్‌ను దక్కించుకున్న సానియాను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అభినందించారు. ఆమె యువతకు స్ఫూర్తని కొనియాడారు.
కాగా, అగ్రస్థానంలో నిలవాలన్న తన స్వప్నాన్ని సాకారం చేసుకున్న సానియా మీర్జా ఇదో అనిర్వచనీయ అనుభూతని, ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పారు. స్విస్ దిగ్గజం మార్టినా హింగిస్‌తో జోడీ కట్టిన తర్వాత సానియా కెరీర్ టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది.
సానియా - హింగిస్‌లు వరుసగా మూడు టైటిళ్లు సాధించడం నిజంగా గొప్ప విషయమే. ఫ్యామిలీ సర్కిల్ టోర్నీ నెగ్గడంతో డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. సోమవారం మహిళల డబుల్స్‌లో నెంబర్ 1 ర్యాంక్‌ను అధికారికంగా ప్రకటించిన తర్వాత.. నా సంతోషానికి అవధుల్లేవు అని సానియా ట్వీట్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు నెంబర్ 1ను అంకితమిచ్చారు.

తనపై విమర్శలు చేసిన వారికి కూడా ధన్యవాదాలని తన సందేశంలో రాశారు. లియాండర్ పేస్, మహేష్ భూపతి తర్వాత నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న భారత క్రీడాకారిణి సానియా. 'నెంబర్ 1 సాధించాలనేది నా చిరకాల కోరిక. అది నిజమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది' అని సానియా చెప్పారు.
నెంబర్ 1 దక్కించుకోవడం ఎలాంటిదంటే.. నా సర్వస్వం అని సానియా మీర్జా అన్నారు. అగ్రస్థానం సాధించమనేది ప్రతి ఒక్కరి కల అని, నెంబర్ వన్‌గా నిలవాలని తన కుటుంబ సభ్యులు, టీమ్ సభ్యులు ఎంతగానో ఆశించారని, వారి ఆశలకు తగ్గట్టు రాణించానని, నెంబర్ వన్ దక్కడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇక్కడ నుంచి మరింత పురోగతి కనబరుస్తానని చెప్పారు.
ఇదిలా ఉండగా, అమెరికా నుంచి రాగానే నేరుగా హైదరాబాద్‌లో జరిగే ఫెడ్ కప్‌లో సానియా పాల్గొంటారు. హింగిస్‌తో జోడీ కట్టిన తర్వాత మూడు టోర్నీల్లో 14 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో మూడు సెట్లు మాత్రమే కోల్పోవడం గమనార్హం. హింగిస్ గొప్ప క్రీడాకారిణి అని, క్లిష్ట సమయాల్లో ఆమె ఎంతో అండగా నిలిచిందని, ఆమె లాంటి భాగస్వామి లభించడం నిజంగా అదృష్టమన్నారు.