ముంబై: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ ఎంపీ సచిన్ టెండూల్కర్ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద సొంతరాష్ట్రమైన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లోని డోంజా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. డోంజా గ్రామం తరహాలోనే ఆ మండలంలోని ఇతర గ్రామాలు కూడా అభివృద్ధి మోడల్‌ను అనుసరిస్తాయని ఉస్మానాబాద్ జిల్లా పరిషత్ సీఈవో ఆనంద్ రాయేట్ తెలిపారు.
2014, అక్టోబర్‌లో సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ పథకం ప్రకారం గ్రామాల్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించాల్సి ఉంటుంది. ఉస్మానాబాద్ జిల్లా గత కొన్నేళ్లుగా తీవ్ర దుర్భిక్షంతో ఉంది.
అంతేగాక, నీటి కరువు చాలా ఉంది. రైతుల ఆత్మహత్యలు కూడా అక్కడ ఎక్కువే. 2011 లెక్కల ప్రకారం డోంజా గ్రామంలో 582 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఆ ఊరి జనాభా మొతం 2863. అందులో 1508 మంది పురుషులు, 1355 మంది మహిళలు ఉన్నారు.

అయితే, డోంజాలో అక్షరాస్యత శాతం మాత్రం 72.17 ఉండటం గమనార్హం. సచిన్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో ఆ గ్రామ దశ తిరుగనుందని గ్రామస్తులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ గ్రామంలో సచిన్ టెండూల్కర్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం ఉంది.
కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని గూడూరు మండలం పుట్టరాజుకండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్ టెండూల్కర్.. ఆ గ్రామంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. రోడ్లు, నీటి వసతిని కల్పించి గ్రామస్తుల ప్రశంసలందుకున్నారు.
ప్రతీ ఎంపీ తమ నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనా కింద పలువురు ఎంపీలు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.