టీ20ల్లో హ్యాట్రిక్.. చహర్ బౌలింగ్‌పై సచిన్, గంగూలీ, లక్ష్మణ్ ప్రశంసలు!!

హైదరాబాద్: టీమిండియా పేసర్ దీపక్ చహర్ టీ20ల్లోనే అత్యుత్తమ బౌలింగ్ (3.2-7-6)తో సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 7 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లతో విజృంభించి భారత్ సిరీస్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో 'హ్యాట్రిక్' తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు. మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు.

దిగ్గజాల అభినందనలు:
సంచలన బౌలింగ్ చేసిన దీపక్ చహర్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతూ అభినందిస్తున్నారు. ఇక భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీలు కూడా తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా అభినందనలు తెలియజేశారు.
అసాధారణమైన బౌలింగ్:
'దీపక్ చహర్‌ది అసాధారణమైన బౌలింగ్. చాలా తెలివిగా బౌలింగ్ చేసాడు. క్లిష్ట సమయంలో కీలకమైన వికెట్లు తీసాడు. వికెట్లు తీయడానికి తన బౌలింగ్ వైవిధ్యాలను బాగా ఉపయోగించాడు. డిసైడర్ మ్యాచ్‌లో టీమిండియాకు విజయాన్ని అందించిన శివమ్ దూబె, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు ప్రత్యేక అభినందనలు' అని సచిన్ ట్వీట్ చేశారు.
బౌలింగ్‌లో చాలా వైవిధ్యాలు ఉన్నాయి:
'అంతర్జాతీయ టీ20 బౌలర్‌గా ఎదిగిన చహర్ తీరు ఎంతో ఆకట్టుకుంది. కొత్త బంతితో ఎప్పుడూ వికెట్లు తీసే సామర్థ్యం అతడికి ఉంది. మధ్య, ఆఖరి ఓవర్లలో బౌలింగ్ చేయడానికి బాగా కష్టపడ్డాడు. అతని బౌలింగ్‌లో చాలా వైవిధ్యాలు ఉన్నాయి. వీటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో అతనికి తెలుసు' అని లక్ష్మణ్ పేర్కొన్నారు.
మ్యాచ్ గెలవడం అంత తేలిక కాదు:
'మ్యాచ్ గెలిచినందుకు దీపక్ చహర్, రోహిత్ శర్మలకు అభినందనలు. మంచు ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మ్యాచ్ గెలవడం అంత తేలిక కాదు' అని గంగూలీ ట్వీటారు. 'అంతర్జాతీయ టీ20ల్లో దీపక్ చహర్ టీమిండియా తరఫున హ్యాట్రిక్ సాధించాడు. అతని బౌలింగ్ సూపర్. ప్రత్యేక అభినందనలు' అని బీసీసీఐ రాసుకొచ్చింది.

కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన:
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20కి ముందు చాహర్ భారత్ తరఫున ఆడిన మ్యాచ్‌లు ఏడు. అందులో ఒకటి వన్డే మ్యాచ్ కాగా.. ఆరు టీ20లు ఉన్నాయి. అయితే బంగ్లాతో జరిగిన చివరి టీ20 చహర్ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సిరీస్‌లో దీపక్ చహర్ 10.2 ఓవర్లు వేసి 56 పరుగులివ్వడమే కాకుండా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. చివరి మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కించుకోవడమే కాకుండా 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా కూడా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications