ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ బుక్ లాంచింగ్‌లో దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ఇండోర్‌లో అండర్-15 శిబిరం సందర్భంగా తొలిసారి సచిన్‌ను చూశానని, అప్పుడు అతడు తన గదిలోనే ఉండేవాడని, రాత్రిళ్లు నిద్రలో లేచి అటుఇటూ నడిచాక.. తిరిగి పడుకునే వాడని, ఎందుకలా అంటే కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పాడు.
దీంతో తాను రాత్రంతా మేలుకొని ఉండవలసి వచ్చేదన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాక కూడా ఈ తిప్పలు తప్పలేదన్నాడు. ఆరంభంలో ఇద్దరం ఒకే డ్రెస్సింగ్ గదిలో ఉండేవారమని, అప్పుడు రాత్రిళ్లు నడవడం కాకుండా.. సాధనతో తనకు నిద్రలేకుండా చేసేవాడన్నాడు.

దీనిపై సచిన్ మాట్లాడుతూ.. ఓ మ్యాచ్‌లో తర్వాత రోజు బ్యాటింగ్ చేయాల్సి ఉండటంతో తన గదిలో అర్ధరాత్రి కూడా అద్దంలో చూసుకుంటూ సాధన చేస్తున్నానని, సమయం రెండున్నర దాటిందని, అప్పుడు గంగూలీ కూడా ఆ గదిలోనే ఉన్నాడని, నిద్ర పోతున్నట్లు నటిస్తూనే తనను గమనిస్తున్నాడని సచిన్ చెప్పాడు.
ఈ సమయంలో గంగూలీ కల్పించుకొని... లైట్లు వేసి ప్రాక్టీస్ చేస్తుంటే నిద్ర ఎలా వస్తుంది అంటూ చమత్కరించాడు. సచిన్ కొనసాగిస్తూ.. ఉదయం బ్యాటింగ్‌కు వెళ్లడానికి ముందు విశ్రాంతి అవసరమనిపించిందని, దగ్గరలో ఓ డైనింగ్ టేబుల్ ఉండటంతో దాని మీదే పడుకున్నానని, ఏమైనా అయితే వచ్చి లేపమని గంగూలీకే చెప్పానని వివరించాడు.
ఆసీస్ టూర్ పైన స్పందిస్తూ.. భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనను మంకీ అంటూ తిట్టాడని, ఇది జాతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని ఆరోపిస్తూ ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమాండ్స్ ఆరోపించడాన్ని సచిన్ తన ఆత్మకథలో ప్రస్తావించాడు. అనవసరమైన రాద్ధాంతాన్ని సృష్టించేందుకు సైమండ్స్ ప్రయత్నించాడని ఆరోపించాడు.
ఆ సమయంలో టూర్‌ను రద్దు చేసుకొని స్వదేశానికి వెళ్లిపోవాలని తాను ప్రతిపాదించినట్టు చెప్పాడు. ఆ ఉదంతంలో భజ్జీ పొరపాటు లేదని సచిన్ స్పష్టం చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి సమాచారం ఏదీ తనకు తెలియదని సచిన్ పేర్కొన్నాడు. అందుకే ఆ విషయాన్ని ఆత్మకథలో ప్రస్తావించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.