
బయోబబుల్‌లోనే బర్త్‌డే సెలబ్రేషన్స్
భారత మాజీ కెప్టెన్ సచిన్ 1973లో ఏప్రిల్ 24న ముంబైలోని ఓ మహారాష్ట్ర కుటుంబంలో జన్మించాడు. సచిన్ ఈరోజు తన 49వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు మెంటార్‌గా ఉన్న సచిన్ బయోబబుల్‌లోనే జట్టుతో పాటు బర్త్‌డేను జరుపుకోనున్నాడు. సచిన్ తండ్రి, ప్రముఖ మరాఠీ నవలా రచయిత రమేష్ టెండూల్కర్. సచిన్‌ను క్రికెట్ పరంగా తండ్రి ఎంతో ప్రోత్సహించాడు. సచిన్ రెండు దశాబ్దాలపాటు టీమిండియా క్రికెట్‌కు ఎనలేని సేవలందించడమే కాకుండా.. అనేక రికార్డులను కొల్లగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో 200టెస్టులు ఆడిన వ్యక్తిగా, 100 అంతర్జాతీయ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా, 34,357అంతర్జాతీయ పరుగులు చేసిన క్రికెటర్‌గా.. చెబుతూ పోతే లెక్కలేనన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత సచిన్ శకం మొదలైంది
సచిన్ టెండూల్కర్ తన 16ఏళ్ల వయసులోనే పాకిస్తాన్ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. క్రికెట్లో డాన్ బ్రాడ్‌మాన్ శకం ముగిశాక.. టెండూల్కర్ శకం మొదలైంది. టెండూల్కర్ తన కెరీర్లో... ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 34,357పరుగులు చేశాడు. 200టెస్టులు ఆడిన సచిన్ టెస్టుల్లో 15,921పరుగులు, 463 వన్డేలలో 18,426పరుగులు, ఒకే ఒక టీ20 ఆడిన సచిన్ అందులో 10పరుగులు చేశాడు. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 147 బంతుల్లో 200పరుగులు నాటౌట్‌తో.. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా టెండూల్కర్ నిలిచాడు. రికార్డుస్థాయిలో ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో ఆడాడు. చివరగా ఆడిన 2011ప్రపంచకప్‌లో అతను టీమిండియాకు వరల్డ్‌కప్ సాధించాలన్న కలను సాకారం చేసుకున్నాడు.

ఐపీఎల్‌లోనూ సచిన్ మార్క్
సచిన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయిన 200వ టెస్ట్‌ను ముంబైలోని హోం గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో ఆడాడు. 2013 నవంబర్‌లో వెస్టిండీస్‌తో తన చివరి టెస్ట్ సిరీస్ ఆడాడు. ఐపీఎల్‌లోనూ సచిన్ మెరిశాడు. టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో 78 మ్యాచులు ఆడాడు. ఐపీఎల్లో ఒక సెంచరీ సహా 13 హాఫ్ సెంచరీలతో మొత్తం 2,334పరుగులు చేశాడు. ఇక చెప్పుకుంటూ పోతే సచిన్ రికార్డుల గురించి ఒక గ్రంథమే అవుతుంది.