హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ముంబైలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు క్రికెటర్లందరూ హాజరయ్యారు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్‌కు బయల్దేరడానికి ముందు భారత ఆటగాళ్ల కోసం ఈ సినిమాని ముంబైలోని వెర్సోవా థియేటర్ ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమా ప్రత్యేక షోకి టీమిండియా ఆటగాళ్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని ప్రేయసి నటి అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన చూసిన అనంతరం సినిమా ఎలా ఉంది అని అడగ్గానే.. నాకు తోచింది నేను చెబుతా.. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లాగా అని ధోనీ అన్నాడు. 'సచిన్‌కు దగ్గరగా ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితుల అభిప్రాయాలను చూపించడం బాగుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే అంజలి వదిన సచిన్ వివిధ అంశాల గురించి ఎలా ఆలోచిస్తారో చెప్పారు' అని తెలిపాడు.
సచిన్ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాలో తనను విపరీతంగా ఆకట్టుకుందంటే అది కుటుంబ సభ్యులతో ఉన్న సన్నివేశాలేనని ధోని చెప్పాడు. ఆ సన్నివేశాలు చాలా బాగున్నాయని, వాస్తవానికి అలాంటి వీడియోలను తాను కోల్పోయానని.. తన వద్ద అలాంటి వీడియోలు ఎక్కువ లేవని ధోని అన్నాడు.

మరోవైపు ఈ సినిమాలో సచిన్ పిల్లలతో ఆడుకుంటున్న దృశ్యాలు, తల్లిదండ్రులు, అంజలితో ఉన్న కొన్ని అద్భుతమైన దృశ్యాలు చూపించారని అవి తనకు ఎంతగానో నచ్చాయని ధోని చెప్పాడు. ఇక ఈ సినిమా యువకులకు ఎలాంటి స్ఫూర్తినిస్తుందన్న ప్రశ్నకు ధోని తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
'యువకులకు స్ఫూర్తినిచ్చే చాలా అంశాలున్నాయి. కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. దానికి తగ్గ శ్రమ కూడా ఉండాలి. అతను ఏం త్యాగం చేశాడో, అతనికి ఎవరు మద్దతిచ్చారో.. ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం సచిన్ గురించి. సినిమా చూడటం చాలా ఆనందకరం. మిస్ అవ్వకండి' అని ధోని అన్నాడు.
ఈ సినిమా ప్రత్యేక షోకి ధోనితో పాటు యువరాజ్ సింగ్, షారూఖ్‌ఖాన్, ఆమీర్ ఖాన్, అమితాబ్‌బచ్చన్ తదితర బాలీవుడ్ ప్రముఖులు సినిమాను వీక్షించారు. జేమ్స్ ఎరిక్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.