భారత క్రికెట్ అభిమానులకు ఇవాళ ఎంతో ప్రత్యేకమైన రోజు. 13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచింది. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టు 2011 వన్డే వరల్డ్ కప్‌ను ముద్దాడింది. వాంఖడే వేదకగా జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేసి ఇండియా జగజ్జేతగా ఖ్యాతిని సంపాదించింది.
ఈ ప్రత్యేకమైన రోజును ప్రస్తావిస్తూ భారత క్రికెటర్లు సోషల్ మీడియాలో తమ అనుభవాలు పంచుకుంటున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లి మాటలతో తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచాడు. ''నా చిన్ననాటి కల 13 ఏళ్ల క్రితం నిజమైంది. ఆ జ్ణాపకాలు, ఆ జట్టు, కోట్ల మంది అభిమానుల మద్దతును ఎప్పటికీ మరిచిపోలేను'' అని సచిన్ ట్వీట్ చేశాడు.

మరోవైపు కోహ్లి ప్రపంచకప్ జ్ణాపకాలను ఆర్సీబీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ''అది ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. వాంఖడేలో ఫైనల్ మ్యాచ్ ఆడాం. సొంత అభిమానుల మధ్య గెలవడం ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ రోజు రాత్రిని అస్సలు మరవలేను. వందేమాతరం సాంగ్ మార్మోగింది. గూస్‌బంప్స్ తెప్పించాయి. అది ప్రధానమైన జ్ణాపకం'' అని విరాట్ కోహ్లి తెలిపాడు.
కాగా, 2011 వరల్డ్ కప్ విజయం సాధించడంలో టీమిండియా ప్లేయర్లంతా కీలకపాత్ర పోషించారు. బ్యాటర్లు, బౌలర్లు పోటాపోటీగా భారత్ గెలుపులో ప్రధానపాత్ర పోషించారు. ఈ మెగాటోర్నీలో సచిన్ టెండూల్కర్ 482 పరుగులు, గౌతమ్ గంభీర్ 393, వీరేంద్ర సెహ్వాగ్ 380 , యువరాజ్ సింగ్ 362 పరుగులు చేశాడు. యువరాజ్ రన్స్‌తో పాటు 15 వికెట్లు సాధించాడు. ఇక కోహ్లి 282 పరుగులు బాదాడు. జహీర్ ఖాన్ 21 వికెట్లు, మునాఫ్ పటేల్ 11, హర్భజన్ సింగ్ 9 వికెట్లతో సత్తాచాటారు. ఫైనల్‌లో కెప్టెన్ ధోనీ అజేయంగా 91 పరుగులు సాధించి అదిరే ముగింపు అందించాడు.