
ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న టీ20ప్రపంచకప్ ట్రోఫీ గెలుచుకునే జట్టు గురించి టీమ్ ఇండియా మాజీ చీఫ్ సెలెక్టర్ సబా కరీమ్ ఓ అంచనాకొచ్చారు. యూఏఈలో జరిగిన 2021 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసీస్ డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగనున్నారు. ఆస్ట్రేలియా తమ బ్యాటింగ్ విభాగంలో తగినంత ఫైర్‌పవర్‌ని కలిగి ఉందని.. అందువల్ల ఆసీస్ ఈసారి కూడా టైటిల్ ఒడిసిపడుతుందని కరీమ్ అభిప్రాయపడ్డాడు.
స్పోర్ట్స్ 18తో సబా కరీమ్ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. 'ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ను గెలవడానికి ఫేవరెట్ జట్టుగా ఉంది. ఆ జట్టు బలమైన జట్టుగా కన్పిస్తుంది. అందుకే నేను ఫేవరెట్ అని భావిస్తున్నాను. పైగా వారు స్వదేశంలో టీ20 ప్రపంచకప్ ఆడబోతుండడం బిగ్ ప్లస్ పాయింట్. ఆస్ట్రేలియా జట్టులో ఇలాంటి టోర్నమెంట్‌లను గెలవడానికి కావాల్సినట్టి ప్లేయర్లు ఉన్నారు. ఆస్ట్రేలియాలో మైదానాలు చాలా పెద్దవి.
కాబట్టి మ్యాచ్‌లో స్కోరు రావాలంటే తప్పకుండా పవర్ హిట్టర్లు కావాలి. ఆ టీంలో టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్ లాంటి పవర్ హిట్టింగ్ సామర్థ్యమున్న ప్లేయర్లు ఉన్నారు. కాబట్టి ఈ రకమైన ప్లేయర్లను కలిగి ఉండడం వల్ల ఆ జట్టు టీ20 ప్రపంచకప్‌ను మళ్లీ నిలబెట్టుకోగలుగుతుందని' కరీమ్ చెప్పాడు.
ప్రస్తుతం ఆసీస్ జట్టు భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20సిరీస్‌లో తలపడుతుంది. ఆసీస్ తొలి మ్యాచ్‌లో 209పరుగుల లక్ష్యాన్ని చాలా తేలికగా ఛేదించింది. ఇకపోతే నేడు నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో జరిగే రెండో టీ20కి ఆ జట్టు సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే ఆ జట్టు సిరీస్ గెలిచినట్టవుతుంది. ఈ సిరీస్ అనంతరం వెస్టిండీస్‌తో స్వదేశంలో ఆ జట్టు టీ20 సిరీస్ ఆడనుంది.