SAT20 లీగ్ లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్ తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచులో పార్ల్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. 213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డుకెక్కింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాండ్స్ లో కూర్చొన్న ఆ చిన్నారి తన ఫేవరెట్ టీమ్ పరాజయం చెందడంతో నిరాశతో తల పట్టుకుంది!. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన ప్రిటోరియా క్యాపిటల్స్ ఆదిలోనే షాక్ తగిలింది. విల్ జాక్స్ 9 పరుగులే చేసి వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత మరో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (3 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 42), విల్ స్మీద్ (5 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 54), కైల్ (2 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 45), జేమ్స్ నీషమ్(28 నాటౌట్) మంచిగానే రాణించారు. దీంతో ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇషాన్ మలింగ 1, డయ్యాన్ గాలియమ్, ముజీబ్ ఉర్ రెహ్మన్ తలో 2 వికెట్లు తీశారు.

అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్ లో జో రూట్ (11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 92), రూబిన్ హెర్మన్ (5 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 33), డేవిడ్ మిల్లర్ (4 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 48) అద్భుతంగా రాణించారు. దీంతో పార్ల్ జట్టు 19.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విల్ జాక్స్, జేమ్స్ నీషమ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో.. స్టాండ్స్ లో కూర్చొన్న ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. తన'క్యూట్ ఎక్స్ప్రెషన్స్'తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తల పట్టుకుని అయ్యో అన్నట్టుగా హావాభావాలు పలికించింది. దీంతో తన ఫేవరెట్ జట్టు ఓటమి చెందడంతోనే చిన్నారి అలా పెట్టిందంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.