సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20)-2025 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఆటగాళ్లు అంచనాలకు మించి భారీ ధర పలికారు. ఈ మినీ ఆక్షన్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. హెండ్రిక్స్‌ను ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ 4.3 మిలియన్ల సౌతాఫ్రికా రాండ్స్‌కు సొంతం చేసుకుంది.
వేలంలో హెండ్రిక్స్‌తో పాటు మరో ముగ్గరు ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. కొలిన్ ఇంగ్రామ్, డేన్ పీడ్ట్‌లపై తలో 175000 రాండ్స్‌ను వెచ్చించింది. ఇక రూకీగా ట్రిస్టన్ లూస్‌ను జట్టులోకి ఆహ్వానించింది. 22 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న దక్షిణాఫ్రికా ప్లేయర్లను రూకీ పిక్‌గా ఫ్రాంచైజీలు జట్టులోకి తప్పక తీసుకోవాలి.

ఇక ఈ వేలంలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. 36 ఏళ్ల ఈ పేసర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈస్టర్న్ కేప్ 2.3 మిలియన్ల రాడర్స్ వెచ్చించి సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్ తరఫున వేలంలో సహ యజమాని కావ్య మారన్ పాల్గొనప్పటికీ ప్రణాళికలు ముందుగానే తమ బృందానికి వెల్లడించింది. ఆక్షన్ టేబుల్‌లో సన్‌రైజర్స్ తరఫున దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ పాల్గొన్నాడు.
రిచర్డ్ గ్లీసెన్ ఇంగ్లండ్ తరఫున కేవలం ఆరు టీ20లు మాత్రమే ఆడాడు. వన్డే, టెస్టులకు ప్రాతినిథ్యమే వహించలేదు. అయితే గత ఐపీఎల్ సీజన్‌లో డెవాన్ కాన్వే గాయంతో దూరమవ్వడంతో అతని స్థానంలో రిచర్డ్‌ను రిజర్వ్ ప్రైజ్ రూ.50 లక్షలకు సీఎస్కే సొంతం చేసుకుంది. టీ20ల్లో ఇంగ్లండ్ తరఫున లేటు వయసులో అరంగేట్రం చేసిన మూడో ప్లేయర్‌గా రికార్డులకెక్కిన అతను.. ఐపీఎల్‌లో 2014 తర్వాత అరంగేట్రం చేసిన రెండో పెద్ద వయస్సుడిగా నిలిచాడు.
అయితే గత ఐపీఎల్ సీజన్‌లో కేవలం రెండే మ్యాచ్‌లు ఆడిన రిచర్డ్ ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అంత గొప్ప ప్రదర్శన ఏమీ చేయలేదు. కానీ సౌతాఫ్రికా పిచ్‌లపై అతను చెలరేగుతాడనే ఉద్దేశంతో సన్‌రైజర్స్ యాజమాన్యం భారీ మొత్తాన్ని వెచ్చించింది. రిచర్డ్ గ్లీసెన్‌తో పాటు సౌతాఫ్రికా బౌలర్ ఓకుహ్లే సెలేను 175000 రాడార్స్‌కు సొంతం చేసుకుంది. రూకీ పిక్‌గా డేనియల్ స్మిత్‌ను జట్టులోకి ఆహ్వానించింది.
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్
ఎయిడెన్ మార్క్రామ్, జాక్ క్రాలే, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లియామ్ డాసన్, ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జేన్సన్, బేయర్ స్వాన్‌పోయెల్, కాలేబ్ సెలెకా, ట్రిస్టన్ స్టబ్స్, జోర్డాన్ హెర్మాన్, పాట్రిక్ క్రుగర్, క్రెయిగ్ ఓవర్‌టన్, టామ్ అబెల్, సైమన్ హార్మర్, ఆండిలే సిమెలెన్, డేవిడ్ బెడింగ్‌హామ్, ఓకుహ్లే సెలే, రిచర్డ్ గ్లీసన్, డేనియల్ స్మిత్.