
జొహానెస్‌బర్గ్: శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో కైవసం చేసుకుంది. రెండో టెస్టును మూడు రోజుల్లోనే ముగించి లంకేయులపై ఆతిథ్య సఫారీ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. 2019లో స్వదేశంలో శ్రీలంక చేతిలో ఎదురైన పరాభవానికి ఇప్పుడు ప్రొటీస్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో లంకను 211 పరుగులకు ఆలౌట్ చేసిన దక్షిణాఫ్రికా.. ఆ తర్వాత 67 పరుగుల లక్ష్యాన్ని వికెట్లేమీ కోల్పోకుండా ఆడుతూ పాడుతూ ఛేదించింది.
మూడో రోజు మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 150/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక.. 211 పరుగులకు ఆలౌటైంది. లుంగీ ఎంగిడి (4/44), లతో సిపమ్లా (3/40), అన్రిచ్ నార్జ్ (2/64) లంక పతనాన్ని శాసించారు. ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 91తో బ్యాటింగ్ కొనసాగించిన కరుణరత్నె సెంచరీ (103: 128 బంతుల్లో 19x4) పూర్తి చేసుకున్నా.. త్వరగానే ఔటయ్యాడు. మొత్తంగా 67 పరుగుల టార్గెట్ దక్షిణాఫ్రికా ముందు నిలిచింది.
67 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా వికెట్లేమీ కోల్పోకుండా ఆడుతూ పాడుతూ ఛేదించింది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు మర్‌క్రమ్ (36 నాటౌట్: 53 బంతుల్లో 4x4), డీన్ ఎల్గర్ (31 నాటౌట్: 27 బంతుల్లో 5x4) కేవలం 13.2 ఓవర్లలోనే 67/0లోనే లక్ష్యాన్ని ఛేదించేశారు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం (127: 163 బంతుల్లో 22x4)తో అదరగొట్టిన సఫారీ బ్యాట్స్‌మన్ డీన్ ఎల్గర్‌కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది. కాగా రెండేళ్లలో దక్షిణాఫ్రికాకు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం.
జొహనెస్‌బర్గ్ వేదికగా ఆదివారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్.. తొలి ఇన్నింగ్స్‌లో పేలవంగా 157 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ కుశాల్ పెరీరా (60: 67 బంతుల్లో 11x4) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్తేజ్ ఆరు వికెట్లు పడగొట్టగా.. మల్డర్ మూడు, సిపమ్లా ఒక వికెట్ తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 302 పరుగులకి ఆలౌటైంది.