హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16వ ఎడిషన్‌లో ఇవ్వాళ సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ సీజన్ లో ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. గత సీజన్ లో ఫైనల్స్ కు చేరిన జట్టు రాజస్థాన్ రాయల్స్. ఆల్‌రౌండర్లతో నిండివుంది. అదే సీజన్ లో అట్టర్ ఫ్లాప్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇప్పుడూ అదే రేంజ్ లో చెత్త ప్రదర్శన చేస్తోంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్- ఘోరంగా విఫలమైంది. బౌలర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్‌ను సాధించారు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు. ఓపెనర్లు యశస్తి జైస్వాల్-54, జోస్ బట్లర్- 54, కేప్టెన్ సంజు శాంసన్- 55, చివర్లో షిమ్రాన్ హెట్మెయిర్ 22 పరుగులతో మెరుపులు మెరిపించడంతో జట్టు స్కోర్ 200 మార్క్‌ను దాటేసింది. సన్‌రైజర్స్ బౌలర్లల్లో ఫజల్ హక్ ఫారూఖీ, టీ నటరాజన్ రెండు చొప్పున, ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీసుకున్నాడు.

204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి బాటలో ఉంది. లక్ష్యాన్ని ఛేదించడం కాదు కదా కనీసం గట్టిపోటీ కూడా ఇవ్వట్లేదు బ్యాటర్లు. వరుసబెట్టి పెవిలియన్ దారి పట్టారు. 81 పరుగులకు ఏడు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ, టాప్ ఆర్డర్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి తమ ఖాతా కూడా ఓపెన్ చేయలేదు. మయాంక్ అగర్వాల్-27 పరుగులు చేశాడు. హ్యారీ బ్రూక్- 13, వాషింగ్టన్ సుందర్-1, గ్లెన్ ఫిలిప్స్-8, ఆదిల్ రషీద్- 18 పరుగులు చేశారు.
ఈ పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊరట కలిగించే అంశం- జట్టు ఫుల్ టైమ్ కేప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ ఫుల్ ఫామ్‌లో ఉండటం. దక్షిణాఫ్రికాకు చెందిన ఎయిడెన్ ప్రస్తుతం తన దేశం తరఫున వన్డే ఇంటర్నేషనల్స్ ఆడుతున్నాడు. తమ దేశ పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్ జట్టుతో వన్డే సిరీస్ ఆడుతోన్నాడు. జొహాన్నెస్‌బర్గ్ వేదికగా ఇవ్వాళ దక్షిణాఫ్రికా- నెదర్లాండ్స్ మధ్య మూడో వన్డే కొనసాగుతోంది.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కులు చూపింది. 50 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 126 బంతుల్లో 175 పరుగులు చేశాడు. ఇందులో 17 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. నెదర్లాండ్స్‌తో సిరీస్ ముగిసిన వెంటనే భారత్‌కు రానున్నాడు. జట్టుతో కలవనున్నాడు.
ఇదే దూకుడును ఐపీఎల్‌లో కూడా మార్క్‌రమ్ కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. ఇదే మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ సైతం దూకుడుగా ఆడాడు. 61 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లతో 91 పరుగులు చేశారు. ఈ ఐపీఎల్‌లో డేవిడ్ మిల్లర్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడాల్సి ఉంది. మార్కో జెన్‌సెన్, ఎన్రిచ్ నోర్ట్జె, లుంగి ఎన్గిడి, హెన్రిచ్ క్లాసెన్, క్వింటన్ డికాక్.. ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో చేరాల్సి ఉంది. సిరీస్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికా ప్లేయర్లందరూ భారత్ కు రానున్నారు.