హైదరాబాద్: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ క్వింటన్ డీకాక్, వెటరన్ బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లా ఇద్దరు మంచి స్నేహితులు. పరిమిత ఓవర్ల ఆటలో వీరిద్దరూ దక్షిణాఫ్రికా తరుపున ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారు.
తాజాగా బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా మధ్య గురువారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో డీకాక్, ఆమ్లా ఓపెనర్లుగా బరిలోకి దిగారు.

వీరిద్దరిని చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. ఈ గందరగోళం దేనికంటే వారిద్దరూ ఒకే పేరు కలిగిన జెర్సీలను ధరించి క్రీజులోకి వచ్చారు. దీంతో మైదానంలో నవ్వులు పూశాయి. అయితే డీకాక్.. ఆమ్లా జెర్సీని ధరించడానికి గల కారణం మాత్రం ఆలస్యంగా తెలిసింది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు డీకాక్ తన జెర్సీని పోగొట్టుకున్నాడు. దీంతో ఆమ్లా జెర్సీని ధరించి క్రీజులోకి వచ్చాడు. ఇది చూసిన ప్రేక్షకులకు తొలుత ఏమీ అర్ధం కాకపోవడంతో కాస్తంత గందరగోళానికి లోనయ్యారు. ఆ తర్వాత విషయం తెలిసి మ్యాచ్‌ని ఎంజాయ్ చేశారు.
ఈ మ్యాచ్‌లో 18 పరుగుల వద్దే హషీమ్ ఆమ్లా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు టీ20ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో బంగ్లాపై దక్షిణాఫ్రికా 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.