డ్రెస్సింగ్ రూమ్‌లో నన్ను తిట్టాడు: స్టార్ క్రికెటర్
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తాను సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నందుకు తన సహచర ఆటగాడు, దక్షిణాఫ్రికా దిగ్గజం క్వింటన్ డికాక్ తనను డ్రెస్సింగ్ రూమ్‌లో తిట్టాడని సరదాగా చెప్పుకొచ్చాడు. అయితే ఇది కోపంతో అన్న మాటలు కాదని.. తమ మధ్య ఉన్న గాఢమైన స్నేహానికి గుర్తు అని ఆయన స్పష్టం చేశారు.
ఒకే స్థానం కోసం ఇద్దరు దిగ్గజాల పోరాటం
ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు విదేశీ ఆటగాళ్ల ఎంపిక విషయంలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్ ఇద్దరూ ఒకే ఓపెనింగ్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. సీజన్ ఆరంభంలో డికాక్ లాంటి మేటి ఆటగాడు బెంచ్‌పై ఉండటం వల్ల తాను మానసిక ఒత్తిడికి గురయ్యానని ర్యాన్ రికెల్టన్ అంగీకరించారు. ప్రపంచమంతా క్వింటన్ డికాక్ ను ఆడించాలని కోరుతున్నప్పుడు ఆ ఒత్తిడి తట్టుకుని రాణించడం సవాలుతో కూడుకున్న పని అని ఆయన పేర్కొన్నారు. అయితే క్వింటన్ డికాక్ చేతికి గాయం కావడంతో ర్యాన్ రికెల్టన్ కు తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం దక్కింది.

సెంచరీ మిస్.. మందలించిన ర్యాన్ రికెల్టన్
లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై విజయం తర్వాత ర్యాన్ రికెల్టన్ మాట్లాడుతూ.. "నేను ఈరోజు సెంచరీ చేసే ఛాన్స్‌ను చేజేతులా వదిలేశానని నన్ను తిట్టిన మొదటి వ్యక్తి డికాక్. అతను అన్న మాటతో నేను కూడా ఏకీభవిస్తాను. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. మేమిద్దరం ఒకరికొకరు ఎంతో మద్దతుగా ఉంటాం" అని వెల్లడించారు. మైదానంలో పోటీ ఉన్నప్పటికీ.. బయట మాత్రం తామిద్దరం మంచి స్నేహితులమని, డి కాక్ తన ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తున్నాడని రికెల్టన్ ప్రశంసించాడు
రికెల్టన్ అద్భుత ఫామ్.. డికాక్ సలహాలు
తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత ర్యాన్ రికెల్టన్ ఆడిన చివరి మూడు ఇన్నింగ్స్‌ల్లో 121.5 సగటుతో 243 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో 380 పరుగులతో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ర్యాన్ రికెల్టన్ స్ట్రైక్ రేట్ 190కి పైగా ఉండటం విశేషం. తన బ్యాటింగ్ శైలిని మెరుగుపరచుకోవడంలో డికాక్ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నాడని.. నెట్స్‌లో తన బ్యాటింగ్‌ను గమనిస్తూ చిన్న చిన్న మార్పులు సూచిస్తున్నాడని ర్యాన్ రికెల్టన్ కృతజ్ఞతలు తెలిపాడు.
ముంబై ఇండియన్స్ ప్రస్తుత పరిస్థితి
వ్యక్తిగతంగా ర్యాన్ రికెల్టన్ రాణిస్తున్నప్పటికీ.. ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ సీజన్ ఏమాత్రం కలిసిరావడం లేదు. 10 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం 6 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. సమీకరణాలు చూస్తే ముంబై ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనైనా గెలిచి గౌరవప్రదంగా సీజన్‌ను ముగించాలని ఆ జట్టు భావిస్తోంది. విదేశీ ఆటగాళ్లు రాణిస్తున్నా, భారతీయ ఆటగాళ్లు విఫలం కావడం ముంబై కొంపముంచిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications