
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఆరంభానికి ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ప్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. డీసీకి కొత్త బౌలింగ్ కోచ్‌గా 40 ఏళ్ల ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌బౌలర్ రియాన్ హారీస్‌ని నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ మంగళవారం ప్రకటించింది. నవంబర్ 19 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్13వ సీజన్ కోసం హారీస్ యూఏఈలో ఢిల్లీ జట్టుతో కలవనున్నాడు. హారీస్ ఆస్ట్రేలియా నుండి నేరుగా దుబాయ్ చేరుకోనున్నాడు.
ఐపీఎల్ 2018, 2019 సీజన్లకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఉన్న జేమ్స్ హోప్స్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది జట్టుతో కలిసి ప్రయాణించలేదని ఫ్రాంఛైజీ వెల్లడించింది. హోప్స్ తన నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే.. రియాన్ హారీస్‌ని బౌలింగ్ కోచ్‌గా డీసీప్రాంచైజీ తీసుకుంది. అంతర్జాతీయ కెరీర్‌లో రియాన్ హారీస్ 27 టెస్టుల్లో, 21 వన్డేల్లో, 3 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన హారిస్.. 113 టెస్ట్ వికెట్లు, 44 వన్డే వికెట్లు, 4 టీ20 వికెట్లు తీశాడు.
'ఐపీఎల్‌లోకి తిరిగి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది' అని రియాన్ హారిస్ తెలిపాడు. 'ఐపీఎల్ ట్రోఫీ సాధించాలనే ఢిల్లీ క్యాపిటల్స్ ఆశయాలకు నా వంతు కృషి చేయడానికి ఇది గొప్ప అవకాశం. డీసీకి అద్భుతమైన బౌలింగ్ లైనప్ ఉంది. వారందరితో కలిసి పనిచేయడానికి వేచిచూస్తున్నా. డీసీకి అన్ని విధాలా నా వంతు చేస్తాను' అని హారిస్ పేర్కొన్నాడు. రికీ పాంటింగ్, మొహమ్మద్ కైఫ్, శామ్యూల్ బద్రీ మరియు విజయ్ దహియాలతో కలిసి హారిస్ పనిచేయనున్నాడు.
రియాన్ హారీస్ ఐపీఎల్‌లో 37 మ్యాచులు ఆడాడు. ఐపీఎల్‌లో 45 వికెట్లు పడగొట్టాడు. నాలుగు వికెట్లు ఒకసారి తీశాడు. 2009లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన డెక్కన్ ఛార్జర్స్ జట్టులో సభ్యుడు. అయితే గాయాల కారణంగా 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాల్సి వచ్చింది. వీడ్కోలు అనంతరం ఆస్ట్రేలియా, బిగ్ బాష్ లీగ్ ప్రాంచైజీ బ్రిస్బేన్ హీట్ కోచింగ్ సిబ్బందిలో చేరాడు. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు.