IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే ప్రస్థానం అత్యంత పేలవంగా మొదలైంది. ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలవ్వడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. గత సీజన్లో 10వ స్థానంతో సరిపెట్టుకున్న సీఎస్కే.. ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తుండటం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ జోడీ ఇంకా పరుగుల ఖాతా తెరవకపోవడం జట్టుకు పెద్ద లోటుగా మారింది.
కెప్టెన్సీకి ముప్పు పొంచి ఉందా?
సీఎస్కే జట్టులో చోటుచేసుకున్న సమీకరణాలపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రాజస్థాన్ రాయల్స్ నుంచి భారీ ధరకు జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ వల్ల రుతురాజ్ గైక్వాడ్ ఒత్తిడికి లోనవుతున్నాడని వారు అభిప్రాయపడ్డారు. మైఖేల్ వాన్ మాట్లాడుతూ.. "సంజు శాంసన్ రాకతో రుతురాజ్ తన కెప్టెన్సీ పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోనని భయపడుతున్నాడా? అని సైమన్ డౌల్‌ను ప్రశ్నించగా.. దానికి డౌల్ "ఖచ్చితంగా అవును" అని సమాధానమిచ్చాడు.

వికెట్ కీపర్.. కెప్టెన్ సెంటిమెంట్
మైఖేల్ వాన్ తన విశ్లేషణను కొనసాగిస్తుూ.. "రుతురాజ్ గైక్వాడ్ యువ కెప్టెన్.. అతనికి జట్టు యాజమాన్యం మద్దతు ఉంది. కానీ హఠాత్తుగా సంజు శాంసన్ వంటి అనుభవజ్ఞుడైన కెప్టెన్‌ను జట్టులోకి తెచ్చారు. సంజు కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, అద్భుతమైన వికెట్ కీపర్ కూడా. దశాబ్ధ కాలంగా ఎంఎస్ ధోనీ అనే వికెట్ కీపర్-కెప్టెన్ నీడలో నడిచిన జట్టు సీఎస్కే. ఇప్పుడు మరో వికెట్ కీపర్-కెప్టెన్ జట్టులోకి రావడంతో రుతురాజ్ గైక్వాడ్ తన స్థానంపై ఆందోళన చెందుతున్నాడు. ఆ ప్రభావం రుతురాజ్ బ్యాటింగ్, కెప్టెన్సీపై స్పష్టంగా కనిపిస్తోంది" అని మైఖేల్ వాన్ పేర్కొన్నారు.
సంజుపై భారీ అంచనాలు.. పెరిగిన ఒత్తిడి
రాజస్థాన్ రాయల్స్ నుంచి ఇద్దరు కీలక ఆటగాళ్లను వదులుకుని మరీ సంజు శాంసన్‌ను సీఎస్కే ట్రేడ్ చేసుకుంది. వరల్డ్ కప్ లో అదరకొట్టిన సంజూ శాంసన్.. దక్షిణాది(చెన్నై) మట్టిపై సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇటు సంజు శాంసన్, అటు రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ తమ సహజ సిద్ధమైన ఆటను ప్రదర్శించకపోతే సీఎస్కే కష్టాల్లో పడటం ఖాయం. వచ్చే మ్యాచ్‌ల్లో రుతురాజ్ గైక్వాడ్ తన బ్యాటింగ్ తో సమాధానం చెబుతాడా? లేక మైఖేల్ వాన్ అన్నట్లు సంజు శాంసన్ నీడలో ఒత్తిడికి తలొగ్గుతాడా అనేది వేచి చూడాలి.