ఐపీఎల్‌లో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా గైక్వాడ్ చెలరేగిన సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం ఇంగ్లండ్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో స్టాండ్ బై ప్లేయర్‌గా అతను లండన్ వెళ్లాల్సింది. కానీ తన పెళ్లి ఉండటంతో ఈ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు
ఈ ఫైనల్ తర్వాత భారత జట్టుకు నెల రోజుల విశ్రాంతి దొరికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అశ్విన్ వంటి వెటరన్లు కూడా ఆటకు దూరం అవ్వకూడదని లోకల్ లీగ్స్‌లో ఆడుతున్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అశ్విన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇదే సమయంలో రుతురాజ్ గైక్వాడ్ కూడా మహరాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటుతున్నాడు.

ఇటీవలే పెళ్లి చేసుకున్న అతను.. ఈ లీగ్‌లో పుణెరి బప్పా టీంకు ఆడుతున్నాడు. కొల్హపూర్ టస్కర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పుణెరి టీం ముందు 145 పరుగుల టార్గెట్ నిలిచింది. ఓపెనర్‌గా బరిలో దిగిన రుతురాజ్ ఈ మ్యాచ్‌లో చెలరేగాడు. ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లతో రాణించిన అతను కేవలం 27 బంతుల్లోనే 64 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతను చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో పుణెరి ఈజీ విక్టరీ సాధించింది.
ఇంకా 29 బంతులు మిగిలుండగానే 8 వికెట్లతో విజయం సాధించింది. రుతురాజ్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో కొన్నిరోజుల్లో మొదలయ్యే వెస్టిండీస్ టూర్‌లో అతన్ని కూడా సెలెక్ట్ చేయాలని కొందరు మాజీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంకా ఆ సిరీస్‌కు సంబంధించిన టీం సెలెక్షన్ విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు ఒక నిర్ణయానికి రాలేదు.
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మకు కొన్ని మ్యాచుల్లో విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. దీంతో ఒక ఓపెనర్ ప్లేస్ జట్టులో ఖాళీ అవనుంది. దీని కోసం రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ పోటీ పడతారని తెలుస్తోంది. టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో అన్ని ఫార్మాట్లలో ఒక ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ తన స్థానాన్ని సిమెంట్ చేసుకోవడంతో రెండో స్థానం కోసం వీళ్లు పోటీ పడనున్నారు.