టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా టాప్ ఆర్డర్‌లో రెండు స్థానాలు ఖాళీలు అయ్యాయి. దాదాపు దశాబ్దం తర్వాత వాళ్ల స్థానాల్లో యువకులు శాశ్వతంగా కుదురుకోవడానికి అవకాశం వచ్చింది. ఓపెనర్‌గా యశస్వీ జైస్వాల్ ఖరారు కావడంతో మరో ఓపెనర్, వన్ డౌన్ స్థానానికి యువ ప్లేయర్ల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది.
శుభ్‌మన్ గిల్‌తో పాటు అభిషేక్ శర్మ ఓపెనర్‌గా గట్టిపోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం సీనియర్ ప్లేయర్ సంజు శాంసన్‌ను కూడా ఓపెనర్‌గా అవకాశాలు ఇస్తున్నారు. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో ప్లేయర్ ఖరారు కాలేదు. వన్‌డౌన్‌లో వస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించి, సందర్భాన్ని బట్టి గేర్ మార్చే బ్యాటర్ కావాలని క్రికెట్ విశ్లేషకులు సూచించారు. ఆ స్థానానికి రుతురాజ్ గైక్వాడ్ సరైనోడు అని అభిప్రాయపడ్డారు. రుతురాజ్ ఓపెనర్‌గానే కాకుండా వన్‌డౌన్‌లో సత్తాచాటగలడని పేర్కొన్నారు.

అయితే జింబాబ్వేతో టీ20 సిరీస్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్‌కు అసలు భారత జట్టులో చోటే దక్కట్లేదు. గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత రుతురాజ్‌ను పక్కనపెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. శ్రీలంక పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లకు రుతురాజ్ ఎంపిక కాలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా పక్కనపెట్టారు. టెస్టు ఫార్మాట్‌కు అసలు ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు రుతురాజ్‌ను సన్నద్ధం చేయడానికి బంగ్లా టీ20 సిరీస్‌కు ఛాన్స్ ఇవ్వలేదని బీసీసీఐ వర్గాలు తర్వాత వివరణ ఇచ్చాయి.
ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత-ఏ జట్టుకు కూడా రుతురాజ్‌ను సారథిగా ఎంపిక చేశారు. అయితే కట్ చేస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన టీమిండియాలో రుతురాజ్‌కు చోటు దక్కలేదు. మరోవైపు భారత్-ఏ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతల కారణాలతో దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లోనూ అతనికి అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ, టీమిండియా మేనేజ్మెంట్‌పై మాజీ క్రికెటర్లతో సహా అభిమానులు విమర్శలు గుప్పించారు.
అయితే టీ20ల్లో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇవ్వకపోవడానికి కారాణాలను టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. రుతురాజ్ కంటే ముందు మరికొందరు గొప్పగా రాణించారని, మొదట వాళ్లకు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తుందని తెలిపాడు. అతనికి ఛాన్స్ ఇవ్వకపోవడానికి మరే ఇతర కారణాలు లేవని పేర్కొన్నాడు. భవిష్యత్‌లో రుతురాజ్‌కు అవకాశాలు దక్కుతాయని సూర్యకుమార్ అన్నాడు. ఇవాళ నుంచి దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో సూర్య ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, డర్బన్ వేదికగా రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.