Ruturaj Gaikwad: భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యక్తిగత కారణాలతో యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో తన ఒప్పందం నుంచి వైదొలిగాడు. ఈ వార్తను యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ శుక్రవారం (జులై 18న) అధికారికంగా ప్రకటించింది.ఇండియా 'ఏ' జట్టు మాజీ కెప్టెన్ రుతురాజ్, జులై 22న సర్రే జట్టుతో జరగనున్న తన మొదటి కౌంటీ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని చాలా మంది ఆశించారు. అయితే రుతురాజ్ గైక్వాడ్ ఇంగ్లాండ్‌కు రాలేడని యార్క్‌షైర్ కౌంటీ ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల రుతురాజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. రుతురాజ్ గైక్వాడ్ ఆకస్మికంగా వైదొలగడానికి గల సరైన కారణం ఇప్పటివరకు వెల్లడి కాలేదు.
రుతురాజ్ వైదొలగడంపై యార్క్‌షైర్ కోచ్ నిరాశ
రుతురాజ్ గైక్వాడ్ వైదొలగడంపై యార్క్‌షైర్ జట్టు ప్రధాన కోచ్ ఆంథోనీ మెక్‌గ్రా తన నిరాశను వ్యక్తం చేశాడు. ప్రధాన కోచ్ ఆంథోనీ మెక్‌గ్రా మాట్లాడుతూ, "దురదృష్టవశాత్తు రుతురాజ్ గైక్వాడ్ వ్యక్తిగత కారణాలతో ప్రస్తుతం రావడం లేదు. ఈ సీజన్‌లో రుతురాజ్ మా జట్టులో ఉండడకపోవడం నిరాశ కలిగిస్తుంది. అతను వైదొలగడానికి గల కారణాన్ని నేను చెప్పలేను. కానీ అంతా సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నాము. రుతురాజ్ బదులుగా ప్రత్యామ్నాయ ఆటగాడిని బరిలోకి దింపగలమా అనేది పరిశీలిస్తున్నాం. కానీ మ్యాచ్‌కు ఇంకా రెండు లేదా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకోవడం కష్టం." అని వెల్లడించాడు.

ఐపీఎల్‌లో గాయం.. ప్రస్తుత స్థితి
రుతురాజ్ గైక్వాడ్ యార్క్‌షైర్ జట్టు తరపున ఐదు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో, లిస్ట్ 'ఏ' మ్యాచ్‌లలో ఆడటానికి ఒప్పందం చేసుకున్నాడు. అంతకుముందు ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించిన రుతురాజ్.. మోచేతి గాయం కారణంగా టోర్నమెంట్ మధ్యలో వైదొలిగాడు. ఏప్రిల్ 8 తర్వాత అతను ఏ అధికారిక మ్యాచ్‌లోనూ ఆడలేదని గమనార్హం.ఇటీవల భారత 'ఏ' జట్టుతో ఇంగ్లాండ్‌కు పయనమైన రుతురాజ్ గైక్వాడ్ అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. అయినప్పటికీ, అనధికారిక టెస్ట్ సిరీస్‌లలో అతను బరిలోకి దిగలేదు. అతని కౌంటీ మ్యాచ్‌లో పాల్గొనడం అతని క్రికెట్ జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా మారుతుందని ఆశించగా, ఈ ఆకస్మిక వైదొలగడం అతని అభిమానులలో తీవ్ర నిరాశను కలిగించింది.