అతడి సలహా వల్లే గెలిచాం: రుతురాజ్ గైక్వాడ్
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా లక్నో జట్టుపై సీఎస్కే ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపు అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్‌లో రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ఈ విజయం తమకు ఎంతో కీలకమని, పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ప్లేయర్లందరూ సమిష్టిగా కృషి చేసి లక్ష్యాన్ని పూర్తి చేశారని, ముఖ్యంగా పవర్‌ప్లేలో తాము ఆశించిన దానికంటే మెరుగైన ప్రదర్శన కనబరిచామని, అదే గెలుపుకు బలమైన పునాది వేసిందని రుతురాజ్ గైక్వాడ్ ప్రశంసించాడు.
జోష్ ఇంగ్లిస్ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు
ప్రత్యర్థి జట్టు బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌ను రుతురాజ్ మనస్ఫూర్తిగా అభినందించాడు. జోష్ ఇంగ్లిస్ అద్భుతమైన షాట్లతో విరుచుకుపడ్డాడని.. ఆ సమయంలో తమ బౌలర్ల వద్ద అతని దూకుడును అడ్డుకోవడానికి ఎటువంటి సమాధానం లేకపోయిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు. అతని ఆట తీరు ఒక దశలో మ్యాచ్‌ను తమ నుంచి పూర్తిగా లాగేసుకునేలా కనిపించిందని, ఆ సమయంలో తమ వ్యూహాలు కూడా పని చేయలేదని రుతురాజ్ అభిప్రాయపడ్డాడు.

సంజూ శాంసన్ సలహా.. బౌలర్ల అద్భుత పునరాగమనం
మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంజూ శాంసన్‌తో జరిగిన చర్చను రుతురాజ్ గుర్తుచేసుకున్నాడు. "పవర్‌ప్లే ముగిసే సమయానికి లక్నో స్కోరు చూసి వాళ్లు చాలా ముందున్నారని మాకు అర్థమైంది. అప్పుడు సంజూ నాతో మాట్లాడుతూ.. మనం ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టాలి, లేదంటే మ్యాచ్ చేజారిపోతుంది అని అన్నాడు" అని వివరించాడు. ఆ తర్వాత నూర్ అహ్మద్, జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీయడంతోనే తాము తిరిగి పుంజుకున్నామని కొనియాడాడు. ఈ వికెట్‌పై 220 నుంచి 230 పరుగులు చేయడం కష్టమేమీ కాదని.. కానీ తమ బౌలర్లు వారిని 203 పరుగులకే కట్టడి చేయడం అభినందనీయమని అన్నాడు.
విశ్రాంతి అవసరం.. ఇదే మా గెలుపు మంత్రం
ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై స్పందిస్తూ.. చెన్నైలో ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో ప్లేయర్లు శారీరకంగా చాలా అలసిపోతున్నారని, అందుకే కొంత విశ్రాంతి అవసరమని రుతురాజ్ అన్నాడు. గత బ్రేక్ సమయంలో తమ జట్టులోని కొన్ని లోపాలను సరిదిద్దుకున్నామని, అది ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించిందని తెలిపాడు. లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని, ఒత్తిడి తీసుకోకుండా విషయాలను సరళంగా ఉంచడమే తమ విజయ మంత్రమని రుతురాజ్ గైక్వాడ్ ఈ సందర్భంగా వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications