సంజు కాదు.. ఆ భరోసా వల్లే గెలిచాం: రుతురాజ్ గైక్వాడ్
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో సీఎస్కే అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపు అనంతరం జరిగిన ప్రజెంటేషన్ వేడుక సందర్భంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ఈ విజయం వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషించాడు. ముఖ్యంగా జట్టును విజయతీరాలకు చేర్చిన సంజు శాంసన్‌పై ఆయన ప్రశంసల జల్లు కురిపించాడు.
సంజు శాంసన్.. సీఎస్కే బ్యాటింగ్ వెన్నెముక
ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంసన్‌ను రుతురాజ్ ఆకాశానికెత్తాడు. "సంజు వంటి నిలకడైన ఆటగాడు మా జట్టులో ఉండటం మా అదృష్టం. సంజు శాంసన్ జట్టుకు వెన్నెముక వంటివాడు. ప్రపంచకప్‌లో చూపించిన అద్భుత ఫామ్‌ను ఇక్కడ కూడా కొనసాగించడం విశేషం. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు బాదిన సంజు శాంసన్.. ఈ కఠినమైన పిచ్‌పై 52 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలవడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. కెప్టెన్‌గా నాకు, ఓపెనర్లు త్వరగా ఔట్ అయినప్పటికీ సంజు ఉన్నాడనే భరోసా మ్యాచ్‌ను గెలిపించింది" అని రుతురాజ్ గైక్వాడ్ కొనియాడాడు.

పిచ్ సవాళ్లు.. బౌలర్ల సమష్టి కృషి
అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్‌పై స్పందిస్తూ.. బ్యాటింగ్‌కు ఇది ఏమాత్రం అనుకూలంగా లేదని రుతురాజ్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ జట్టు ప్రారంభంలోనే 5 వికెట్లు కోల్పోయినా, రిజ్వీ, స్టబ్స్ పోరాడి 155 పరుగులు చేయడం గొప్ప విషయమన్నారు. అయితే సీఎస్కే బౌలర్లు వారిని మరింత స్కోరు చేయకుండా కట్టడి చేయడంలో సఫలమయ్యారని ప్రశంసించాడు. అఖీల్ హోసేన్, జేమీ ఓవర్టన్, అన్షుల్ వంటి బౌలర్లు నిశ్శబ్దంగా తమ పనిని పూర్తి చేశారని, జట్టు సమష్టిగా రాణించడం వల్లే ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగామని రుతురాజ్ పేర్కొన్నాడు.
ప్లే-ఆఫ్ ఆశలు
ఈ విజయం సీఎస్కేకు ప్లే-ఆఫ్ రేసులో కొత్త జవజీవాలను ఇచ్చింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకోవడమే కాకుండా, నెట్ రన్ రేట్‌ను (+0.005) మెరుగుపరుచుకోవడం జట్టుకు సానుకూలాంశమని రుతురాజ్ గైక్వాడ్ వివరించాడు. లీగ్ దశ ముగిసే సమయానికి నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుందని, అందుకే 15 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించడం తమకు ఎంతో మేలు చేస్తుందన్నారు. కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, తాను సీజన్ ప్రారంభం నుంచే సానుకూల దృక్పథంతో ఉన్నామని, ఇప్పుడు జట్టు మొత్తం ఒకే తాటిపైకి వచ్చి రాణించడం ఆనందంగా ఉందని రుతురాజ్ సంతృప్తి వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications