వార్నర్ పార్క్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ (113; 80 బంతుల్లో, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు శతకం సాధించడంతో 295 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 14 బంతులు మిగిలుండగానే ఛేదించింది. వార్నర్ పార్క్ మైదానంలో ఇదే అత్యుత్తమ ఛేదన
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 294 పరుగులు చేసింది. కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ (74; 101 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్), తాంజిద్ హసన్ (60; 60 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మదుల్లా (50; 44 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. జేకర్ అలీ (48; 40 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో షెఫార్డ్ (3/51) మూడు వికెట్లు, అల్జారీ జోసెఫ్ (2/67) రెండు, సీల్స్ (1/63) ఒక్క వికెట్ తీశారు.

అనంతరం ఛేదనకు దిగిన వెస్టిండీస్ అయిదు వికెట్లు కోల్పోయి 47.4 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. రూథర్‌ఫర్డ్ విధ్వంసకర సెంచరీతో పాటు కెప్టెన్ షై హోప్ (86; 88 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తాచాటాడు. జస్టిన్ గ్రీవ్స్ (41 నాటౌట్; 31 బంతుల్లో, 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తంజీమ్ (1/55), నహీద్ (1/50), రిషద్ (1/49), మెహదీ (1/62), సౌమ్య సర్కార్ (1/24) తలో వికెట్ తీశారు.

ఛేదనలో వెస్టిండీస్ శుభారంభం దక్కలేదు. 27 పరుగులకే ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (9; 17 బంతుల్లో, 2 ఫోర్లు), ఎవిన్ లూయిస్ (16; 31 బంతుల్లో, 3 ఫోర్లు) పెవిలియన్ చేరారు. వన్‌డౌన్‌లో వచ్చిన కార్టీ (21; 37 బంతుల్లో, 2 ఫోర్లు) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ దశలో వచ్చిన షై హోప్-రూథరఫర్డ్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. నాలుగో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం హోప్ ఔటైనప్పటికి జస్టిన్‌తో కలిసి రూథర్‌ఫర్డ్ అయిదో వికెట్‌కు 95 పరుగులు జోడించి వెస్టిండీస్ విజయాన్ని ఖరారు చేశాడు. మంగళవారం రెండో వన్డే జరగనుంది.