
శనివారం రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టైటిల్ గెలిచిన తర్వాత ఇండియా లెజెండ్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఫైనల్‌లో శ్రీలంక లెజెండ్స్‌పై గెలిచి.. వరుసగా రెండోసారి ఇండియా టైటిల్ ఒడిసిపట్టిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఫైనల్లో నమన్ ఓజా అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో నువాన్ కులశేఖర బౌలింగ్లో సచిన్ డకౌట్ కావడంతో సచిన్ నుంచి మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కొద్దిసేపటికే సురేశ్ రైనా కూడా 4 పరుగులకే ఔటవ్వడంతో ఇండియా లెజెండ్స్ కష్టాల్లో పడింది. అయితే వినయ్ కుమార్ (36పరుగులు) ఓజా (108పరుగులు నాటౌట్) మంచి భాగస్వామ్యం నెలకొల్పి.. మళ్లీ జట్టును ట్రాక్‌లోకి తీసుకొచ్చారు. వినయ్ కుమార్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపించడం ఫలించింది.
నమన్ ఓజా బ్రిలియంట్ ఇన్నింగ్స్ వల్ల ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20ఓవర్లలో 195పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక ఛేదనలో శ్రీలంక లెజెండ్స్ ఆదిలో చాలా తడబడింది. ఇండియా లెజెండ్స్ బౌలర్లు రాణించడంతో ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 12.1 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 85పరుగులతో దాదాపు ఓటమికి చేరువైంది. అయితే ఇషాన్ జయరత్నే (51పరుగులు 22బంతుల్లో) హాఫ్ సెంచరీతో ఉన్నంత సేపు స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. మహేల ఉదవత్తె (26) సైతం అతనికి అండగా రాణించాడు. ఉదవత్తే అవుటైన తర్వాత.. శ్రీలంక లెజెండ్స్ మళ్లీ కోలుకోలేకపోయింది. 162పరుగులకే పరిమితమైంది. తద్వారా ఇండియా లెజెండ్స్ 33పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఇక ఈ విజయం అనంతరం సచిన్ టెండూల్కర్ ట్విటర్లో స్పందిస్తూ.. తమ జట్టు ప్రదర్శనను మనసారా అభినందించాడు. సెమీస్లో, ఫైనల్లో రాణించిన ఓజాను ప్రత్యేకంగా కొనియాడాడు. ఫైనల్లో ఓజా బ్యాటింగ్ అద్భుతంగా ఉందని చెప్పాడు. 'అప్పట్లో టీమిండియాకు, ఇప్పుడు ఇండియా లెజెండ్స్‌కు ఆడడం బాగుంది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఇండియా జట్టే నా ప్రాధామ్యం. #RoadSafetyWorldSeriesలో మరోసారి గెలవడం చాలా సంతోషంగా ఉంది. మా జట్టు నుంచి ఇది అద్భుతమైన ప్రయత్నం. గత రాత్రి నమన్ ఓజా బ్యాటింగ్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. ఈ విజయం నా సహచరులు, అభిమానులందరికీ అంకితం! అని టెండూల్కర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.