కేకేఆర్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. ఆ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (98 నాటౌట్) చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కేవలం 149 పరుగులే చేయగలిగింది. ఈ లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్‌కు యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభం అందించాడు.
తొలి ఓవర్ నుంచే జైస్వాల్ ఊచకోత మొదలైంది. అయితే జైస్వాల్‌తో కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా జోస్ బట్లర్ (0) పరుగులేమీ చేయకుండానే రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. బట్లర్ అవుటైన బాధ్యత కూడా తనే తీసుకున్న జైస్వాల్.. ఎడాపెడా బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలో కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకొని అభిమానుల్లో జోరు పెంచాడు.

ఆ తర్వాత అతనికి జతకలిసిన కెప్టెన్ సంజూ శాంసన్ కూడా చూడచక్కని షాట్లతో అలరించాడు. వీళ్లిద్దరూ భారీ షాట్లతో చెలరేగడంతో కేకేఆర్ స్పిన్నర్లు ఏం చెయ్యలేకపోయారు. వాళ్లు ఎంత కష్టపడినా వికెట్లు మాత్రం పడడలేదు. వీళ్లిద్దరూ అద్భుతంగా ఆడటంతో రాజస్థాన్ జట్టు కేవలం 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ విజయంపై రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ స్పందించాడు. 'నేను చెయ్యడానికి ఏం మిగల్లేదు. స్ట్రైక్ రొటేట్ చేసి అవతలి నుంచి చూస్తూ ఉన్నానంతే. జైస్వాల్‌కు పవర్‌ప్లే అంటే చాలా ఇష్టం. తను ఇంత బాగా ఆడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఇప్పటికైనా చాహల్‌కు లెజెండ్ ట్యాగ్ ఇవ్వాలని అనుకుంటున్నా' అని చెప్పాడు.
'చాహల్‌కు ఒక విధంగా రుణపడి ఉంటా. తనకు బంతి ఇచ్చి ఏం చెయ్యాలో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తనే అర్థం చేసుకుంటాడు. లెగ్ స్పిన్నర్లు డెత్ ఓవర్లు వేసే సంప్రదాయం మొదలు పెట్టింది కూడా అతనే. ఇది క్వార్టర్ ఫైనల్ అనుకుంటే.. మేం ఇంకా రెండు క్వార్టర్ ఫైనల్స్ ఆడాల్సి ఉంది' అంటూ నవ్వేశాడు.
అయితే ఈ టోర్నీలో తమపై ఏమాత్రం ఒత్తిడి తగ్గలేదని స్పష్టం చేశాడు. ఆడే ప్రతి మ్యాచ్ చాలా కీలకమని, ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉందని చెప్పాడు. ఇక జట్టులో డ్రెస్సింగ్ రూం వాతావరణం ఎలా ఉందని ప్రశ్నించగా నవ్వేసిన సంజూ.. 'జైస్వాల్ వంటి కుర్రాడి కోసం బట్లర్ తన వికెట్ వదిలేశాడంటే.. మా డ్రెస్సింగ్ రూం వాతావరణం ఎలా ఉందో అర్థం కావట్లేదా?' అని ప్రశ్నించాడు.