కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. మైదానంలో ఆ టీం ఆటగాళ్లు అందరూ చాలా చురుగ్గా కదులుతున్నారు. ఈ క్రమంలోనే కేకేఆర్‌కు సరైన ఆరంభం కూడా దక్కలేదు. ఆ టీంకు విధ్వంసకర ఆరంభాలు అందిస్తున్న జేసన్ రాయ్ (10) అవుటయ్యాడు.
బౌల్డ్ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు అతను ప్రయత్నించాడు. ఈ సమయంలో డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హెట్మెయర్ చాలా వేగంగా రియాక్ట్ అయ్యాడు. క్యాచ్ అందుకునే సమయంలో కొంత తడబడినా కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని పట్టేశాడు. దీంతో రాయ్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

జేసన్ రాయ్ అవుట్ అవడంతో జట్టుకు ధనాధన్ ఓపెనింగ్ ఇచ్చే బాధ్యతను రహ్మనుల్లా గుర్బాజ్ (18) తీసుకున్నాడు. సందీప్ శర్మ వేసిన ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో అతను కూడా మంచి జోరు మీద కనిపించాడు. పవర్‌ప్లేలో కేకేఆర్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. అయితే మరోసారి బౌల్ట్ ఈ వేగానికి బ్రేకులు వేశాడు.
బౌల్ట్ బౌలింగ్‌లో మిడాఫ్ దిశగా బౌండరీ బాదేందుకు గుర్బాజ్ ప్రయత్నించాడు. అది కచ్చితంగా బౌండరీ వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. అయితే అక్కడ ఫీల్డింగ్‌లో ఉన్న సందీప్ శర్మ.. చటుక్కున ఆ బంతి గాల్లో ఉండగానే పట్టేసుకున్నాడు. అది క్యాచ్ పట్టేయడం చూసిన గుర్బాజ్ తన బ్యాటు నెత్తిన పెట్టుకొని పెవిలియన్ బాటపట్టాడు.
బంతి వేసిన బౌల్ట్ కూడా ఈ క్యాచ్ చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఏదేమైనా రాజస్థాన్‌కు మరో కీలకమైన వికెట్ దక్కింది. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా (27), ఆండ్రీ రస్సెల్ (10) కూడా పెద్దగా రాణించలేదు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంకటేశ్ అయ్యర్ (57) కూడా చాహల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.