ఐపీఎల్ 2023లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ తన పెళ్లి ఉందని వెళ్లిపోయాడు. అతనెవరో కాదు.. ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్. అయితే అతను మరో పదిరోజుల్లో తిరిగి వస్తాడని ఢిల్లీ టీం బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ వెల్లడించాడు. అతని తిరిగి రాగానే నేరుగా ఆడిస్తామని కూడా స్పష్టం చేశాడు.
ఇప్పటి వరకు ఢిల్లీ ఆడిన రెండు మ్యాచుల్లోనూ మార్ష్ పెద్దగా రాణించలేదు. బ్యాటింగ్ లైనప్‌లో మూడో స్థానంలో వస్తున్న అతను జట్టుకు బలంగా మారతాడని అనుకుంటే.. పెద్ద బలహీనతగా మారాడు. లక్నోతో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత గుజరాత్‌తో మ్యాచ్‌లో నాలుగు పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో అతన్ని జట్టులో ఉంచడం అవసరమా? అని ఫ్యాన్స్ ప్రశ్నించడం మొదలు పెట్టారు.

అయితే గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ బౌలింగ్ చేశాడు. కొంత కాలంగా ఆస్ట్రేలియా తరఫున కూడా బౌలింగ్ చేయని అతను.. ఢిల్లీ తరఫున బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 3.1 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను 24 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. తన బౌలింగ్‌లో ఇంకా పదును తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇదే విషయాన్ని జేమ్స్ హోప్స్ కూడా చెప్పాడు.
'భారత్‌తో వన్డే సిరీస్‌లోనే మార్ష్ బౌలింగ్ చేయాల్సింది. కానీ కుదర్లేదు. గుజరాత్ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను జట్టుకు చాలా కీలకం. పెళ్లి అయిపోగానే తను తిరిగి వస్తాడు. రాగానే నేరుగా అతన్ని పదకొండు మందిలోకి తీసేసుకుంటాం' అని హోప్స్ స్పష్టం చేశాడు. రాజస్థాన్‌తో ఆడే మ్యాచ్‌లో కూడా మార్ష్ ఆడటం లేదు. మరో మూడు, నాలుగు మ్యాచులు అతను మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అతని స్థానంలో ఫిల్ సాల్ట్‌కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.