పాయింట్ల పట్టికలో టాప్-2లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు షాక్ తగిలింది. గౌహతి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయిదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రాజస్థాన్‌కు వరుసగా ఇది నాలుగో ఓటమి. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికీ వరుస ఓటములు రాజస్థాన్‌ను కలవరపెడుతోంది. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌ఆర్ 16 పాయింట్లు సాధించింది.
స్లో పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (48; 34 బంతుల్లో, 6x4), రవిచంద్రన్ అశ్విన్ (28; 19 బంతుల్లో, 3x4, 1x6) టాప్ స్కోరర్లు. సామ్ కరన్ (2/24), రాహుల్ చాహర్ (2/26), హర్షల్ పటేల్ (2/28) తలో రెండు వికెట్లతో చెలరేగారు.

ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. సామ్ కరన్ (63*; 41 బంతుల్లో, 5x3, 3x6) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ (2/28), చాహల్ (2/31) చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, మ్యాచ్ ముగిసిన అనంతరం రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ మాట్లాడాడు. గౌహతి పిచ్‌పై 160 స్కోరు సాధించవచ్చని, 10-15 పరుగులు తక్కువగా చేయడమే తమ జట్టు కొంపముంచిందని అన్నాడు.
''మేం మరికొన్ని పరుగులు సాధించాల్సింది. 10-15 పరుగులు తక్కువగా చేశాం. ఇది 160 పరుగులు సాధించగలిగే వికెట్. మేం కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసిన ఉంటే 160+ స్కోరు చేసేవాళ్లం. కానీ అలా చేయలేదు. అదే ఓటమికి కారణమైంది. మా వద్ద మరో బౌలర్ ఆప్షన్ ఉంటే బాగుండేది. అయిదుగురు బౌలర్లతోనే మైదానంలో అడుగుపెట్టాం. అయితే మా వద్ద ఉన్న అయిదుగురు నాణ్యమైన బౌలర్లే''
''మేం 200+ స్కోరు సాధించే వికెట్లపై ఆడాం. కానీ ఈ సీజన్‌లో అంతకుముందు ఇలాంటి స్లో వికెట్‌పై ఆడలేదు. కీలక భాగస్వామ్యాలు నిర్మించాల్సింది. ఇక వరుస ఓటముల గురించి మేం ఆలోచించాలి. వైఫల్యాలకు కారణమేంటో కూర్చొని చర్చించుకోవాలి. ఎవరైనా ముందుకు వచ్చి మ్యాచ్‌లను గెలిపించాలి. మా జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎంతో మంది ఉన్నారు. ఈ సారి మా పట్టుదల చూపిస్తూ సత్తాచాటాలి'' అని శాంసన్ పేర్కొన్నాడు.