
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఒకడు. ఐపీఎల్‌లో రాహుల్ సగటు 46కు పైగా ఉందంటేనే ఈ లీగ్‌లో అతను ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో కెప్టెన్‌గానూ రాహుల్ సత్తా చాటుతున్నాడు. లక్నోసూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాహుల్.. ఆ జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన లక్నో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉంది. అయితే రాహుల్ నేతృత్వంలోని లక్నోసూపర్ జెయింట్స్ నేడు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సూపర్ రికార్డులు ఉన్నాయి. రాజస్థాన్‌పై ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ ఏకంగా 58 సగటుతో 530 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 134గా ఉంది. 5 సార్లు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. నేటి మ్యాచ్‌లోనూ రాజస్థాన్ రాయల్స్‌పై కేఎల్ రాహుల్ తన ఫామ్‌ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే జరిగితే నేటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కష్టాలు తప్పవనే చెప్పుకోవాలి. కాగా ఈ సీజన్‌లో రాహుల్ ఇప్పటివరకు తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 98 మ్యాచ్‌లాడిన రాహుల్ 46 సగటుతో 3405 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 132 పరుగులుగా ఉంది. స్ట్రైక్‌రేట్ 136గా ఉంది. ఈ క్రమంలో రాహుల్ 292 ఫోర్లు, 139 సిక్సులు బాదాడు.
తుది జట్లు (అంచనా)
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్/దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, జిమ్మీ నీషమ్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.