RR VS LSG: లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతోన్న మ్యాచులో టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav suryavanshi) చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసు (14 ఏళ్ల 23 రోజులు)లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతడు.. తన తొలి మ్యాచును ఎప్పటికీ గుర్తుండిపోయేలా మలుచుకున్నాడు. అరంగేట్ర మ్యాచులో సెన్సేషనల్ బ్యాటింగ్ తో అద్భుతంగా కెరీర్ ప్రారంభించిన అతడు.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సుగా మలిచి క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు. శార్దూల్ వేసిన బంతిని కవర్స్ మీదుగా బాది అద్భుతమైన సిక్సుగా మలిచాడు. తద్వారా తొలి మ్యాచులోనే సిక్సర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. మూడో బంతిని కూడా సిక్స్ బాది అదరగొట్టాడు.
ఈ మ్యాచులో వైభవ్ సూర్యవంశీ పైకి కామ్ గా కనపడుతూనే ఎంతో ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు. తన బ్యాటును ఝళిపించి.. ప్రతీ బంతిని బలంగా బాదాడు. మొత్తంగా బ్రిలియంట్ బౌండరీలు, అదిరే సిక్సులతో మైదానాన్ని హోరెత్తించాడు. 20 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 34 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మార్ క్రమ్ బౌలింగ్ లో 8.4 ఓవర్ వద్ద వికెట్ కీపర్ రిషభ్ పంత్.. అతడి స్టంపౌట్ చేశాడు. అయితే అతడి ప్రదర్శనతో మంత్రముగ్ధులైన క్రికెట్ అభిమానులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కాగా, బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీని.. గతేడాది మెగా వేలంలో రూ.1.10 కోట్ల ధరకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. దిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడి మరీ అతడిని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. దీంతో వేలంలో అమ్ముడుపోయిన అతిపిన్న వయసు ఆటగాడిగానూ వైభవ్ రికార్డు సృష్టించాడు.

అప్పటికీ పుట్టనేలేదు..
2008లో ఐపీఎల్ ప్రారంభ సమయానికి వైభవ్ ఇంకా పుట్టనేలేదు. సూర్యవంశీది రైతు కుటుంబం. అతడి తండ్రి ఒక రైతు. అయితే వంశీ నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ బ్యాట్ పట్టాడు. దీంతో అతడి కోసం తండ్రి సంజీవ్ ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించారు. ఆ తర్వాత క్రికెట్‌లో రాణించిన వైభవ్.. అండర్-16 ఆడాడు. అనంతరం ఈ ఏడాది చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్-19 యూత్ టెస్టులోనూ అదిరే ప్రదర్శన చేశాడు. 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్నాడు. అండర్-19 టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు.