RR VS LSG: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరోసారి దురదృష్టం వెంటాడింది. లక్నో సూపర్ జెయింట్స్ పై 2 పరుగులు స్వల్ప తేడాతో ఓడింది. ఆఖరి ఓవర్ లో రాజస్థాన్ జట్టు విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. కానీ ఆ సమయంలో ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి.. రాజస్థాన్ కొంపముంచాడు. దీంతో ఆర్ఆర్ జట్టు వరుసగా మూడో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో రాజస్థాన్ కు ఇది 6వ ఓటమి అవ్వడంతో.. పాయింట్ల పట్టికలో 8 స్థానంలో నిలిచింది. అయితే మ్యాచ్ అనంతరం ఓటమి గల కారణాలను తెలిపిన కెప్టెన్ రియాన్ పరాగ్.. నిరాశ వ్యక్తం చేశాడు.
ఎవరెలా ప్రదర్శన చేశారంటే?
ఈ మ్యాచులో 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. 14 ఏళ్ల టీనేజర్ వైభవ్ సూర్యవంశీ (20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 34 పరుగులు) తన అరంగేట్ర మ్యాచులోనే మంచి ప్రదర్శన చేశాడు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 74 పరుగులు) మంచిగా రాణించాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్ కు 85 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. నితీశ్ రాణా (8) విఫలమయ్యాడు. రియాన్ పరాగ్ (39) పర్వాలేదనిపించాడు. సిమ్రాన్ హెట్మెయర్ (12) నిరాశపరిచాడు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. శార్దూల్ ఠాకూర్,మారక్రమ్ తలో వికెట్ తీశారు.

అదే మా ఓటమికి కారణం..
మ్యాచ్ ఓటమిపై రియాన్ పరాగ్ మాట్లాడుతూ. "ఈ ఓటమి బాధను జీర్ణించుకోవడం కాస్త కష్టం. తప్పు ఎక్కడ చేశామో కచ్చితంగా చెప్పలేను. 18-19వ ఓవర్ల వరకు మ్యాచ్‌లో మేము పోటీలోనే ఉన్నాం. నేను 19వ ఓవర్‌లోనే ఫినిష్ చేయాల్సింది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తున్నాను. నన్ను నేను నిందించుకుంటున్నాను. ఒక మ్యాచ్‌ను మొత్తం 40 ఓవర్ల పాటు కలిసి ఆడితే తప్ప విజయం సాధ్యం కాదు. బౌలింగ్ అద్భుతంగా చేశాం. చివరి ఓవర్ లో అదృష్టం కలిసి రాలేదు. మేము వాళ్లను 165-170 వద్ద కట్టిడి చేస్తామనుకున్నాం. సందీప్ శర్మపై మాకు నమ్మకం ఉంది. కానీ అతడికి ఒక్క బ్యాడ్ గేమ్ ఇది. సమద్ చాలా బాగా ఆడాడు. మేం ఇది ఛేజ్ చేయాల్సిన మ్యాచ్. పిచ్ బానే ఉంది. కానీ IPLలో కొన్ని బంతులు మాత్రమే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తాయి." అని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు.