RR vs KKR: ఐపీఎవ్ 2025 టోర్నమెంట్ లో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నేడు ఆరో మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ ను వీక్షించవచ్చు. ఈ రెండు జట్లు ఓటమితో ఐపీఎల్ సీజన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించగా.. రాజస్థాన్ రాయల్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించాయి. రెండు జట్లు బ్యాటింగ్ లో బాగా రాణించాయి, కానీ బౌలింగ్ బలహీనంగా ఉంది. ఇప్పుడు తొలి విజయం కోసం ఆర్ఆర్ , కేకేఆర్ జట్లు సిద్ధంగా ఉన్నాయి.
రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య ఇప్పటివరకు 30 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 14 మ్యాచ్‌లలో రాజస్థాన్ విజయం సాధిస్తే.. మరో 14 మ్యాచ్‌లలో కోల్‌కతా జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది. మరో రెండు మ్యాచ్ లు టై అయ్యాయి. అంటే ఈ రెండు జట్లు కూడా సమాన బలాలతో ఇప్పటివరకు తలపడ్డాయి. ఇవాళ్టి మ్యాచ్ లో కూడా ఇరు జట్లకు 50 శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టుకు సంజు శాంసన్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రియాన్ పరాగ్ ఆ జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

గౌహతి బర్సపారా క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్టు ఇదే..
బర్సపారా క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తారు. టీ20 ఫార్మాట్‌లో ఇక్కడ కొన్ని మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు దాదాపు 200కు పైనే ఉంటుంది. అయితే పిచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు కొంత సహాయాన్ని అందిస్తుంది. బుధవారం టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయాలనుకునే అవకాశం ఉంది. బర్సపారా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్, కోల్‌కతా జట్ల మధ్య ఓ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేయబడింది. రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది.
గౌహతి స్టేడియం రికార్డులు
గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో మొత్తం నాలుగు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు రెండు సార్లు గెలిచాయి. లక్ష్యాన్ని ఛేదించిన జట్లు ఒక్కసారి మాత్రమే గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఈ మైదానంలో అత్యధిక స్కోరు 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాజస్థాన్ రాయల్స్ చేసిన 199/4. ఈ మైదానంలో శిఖర్ ధావన్ అత్యధిక వ్యక్తిగత స్కోరును కలిగి ఉన్నాడు. 2023లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ తరపున అతను 56 బంతుల్లో అజేయంగా 86 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ ఈ స్టేడియంలో అత్యధిక పరుగులు చేశాడు. జోస్ బట్లర్ రెండు ఇన్నింగ్స్‌లలో 98 పరుగులు చేశాడు.
ఈ స్టేడియంలో మూడు అర్థ సెంచరీలు నమోదయ్యాయి. సామ్ కరణ్, జోస్ బట్లర్, శిఖర్ ధావన్ తలా ఒక అర్థ సెంచరీ సాధించారు. బౌలింగ్ విషయంలో పంజాబ్ కింగ్స్‌కు చెందిన నాథన్ ఎల్లిస్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. 2023లో రాజస్థాన్ రాయల్స్ పై నాథన్ ఎల్లిస్ నాలుగు ఓవర్లలో 30 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. ఈ స్టేడియంలో యుజ్వేంద్ర చాహల్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. చాహల్ ఆరు వికెట్లు పడగొట్టాడు.
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల అంచనా
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్-11: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, నితీష్ రానా, ధ్రువ్ జురేల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మేయర్, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ, ఫజల్ హక్ ఫారూఖీ
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్-11: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సర్/అన్రిచ్ నార్ట్జే, వరుణ్ చక్రవర్తి.