
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ వీర బాదుడు బాదేశాడు. తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు బాదిన బట్లర్ పవర్‌ప్లేలోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో పవర్‌ప్లేలోనే హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా బట్లర్ రికార్డు సృష్టించాడు. రెండో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సు కొట్టాడు. ఇక నాల్గో ఓవర్లో బట్లర్ 3 ఫోర్లు, ఒక సిక్సు బాదాడు. ఇక ఫెర్గ్యూసన్ వేసిన ఆరో ఓవర్లోనూ ఓ సిక్సు బాదిన బట్లర్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఈ సీజన్లో ఇది మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ. అయితే ఆ తర్వాతి బంతికే బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 24 బంతుల్లో 54 పరుగులు చేశాడు. కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బట్లర్ ఉన్నాడు. దీంతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ అతని వద్దే ఉంది.
ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విసిరిన 193 పరుగుల భారీ లక్ష్య చేధనలో రాజస్థాన్ రాయల్స్ తడబడుతుంది. 13 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రియాన్ పరాగా, నీషమ్ ఉన్నారు. ఆ జట్టు బ్యాటర్లలో జోస్ బట్లర్ 54, హెట్‌మేయర్ 29, శాంసన్ 11, అశ్విన్ 8, డసెన్ 6 రన్స్ చేశారు. అంతకు ముందు గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా 87 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అతనికి అభినవ్ మనోహర్ (43), డేవిడ్ మిల్లర్ (31*) సహకరించారు.