Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో తాజాగా జరిగిన కీలక మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ (101: 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో ఈ విక్టీరీని అందుకుంది. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అయితే ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేధనలో రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వైభవ్ సూర్యవంశీతో పాటు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (70*: 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో చెలరేగాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

మాజీల ప్రశంసల వర్షం..
ఐపీఎల్ లో వైభవ్ కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అలానే ఐపీఎల్ చరిత్రలో భారత్ తరఫున అత్యంత వేగంగా (35 బంతుల్లో) సెంచరీ చేసిన క్రికెటర్ గానూ వైభవ్ రికార్డు కెక్కడం విశేషం. దీంతో క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, యూసఫ్ పఠాన్ సహా పలువురు అతడిని ప్రశంసిస్తున్నారు.
అందుకే సెంచరీ చేయగలిగా..
ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం తన తొలి సెంచరీపై వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. తాను సెంచరీ బాదడానికి గల కారణాన్ని వివరించాడు. "ఇది నాకెంతో ప్రత్యేకమైన అనుభూతి. ఐపీఎల్ లో ఇది నా తొలి శతకం. అలానే ఇది నా మూడో ఇన్నింగ్స్. టోర్నమెంట్‌కు ముందు చేసిన కఠినమైన ప్రాక్టీసే ఇప్పుడు కనిపిస్తోన్న ఫలితం. నేను కేవలం బంతిని చూస్తాను. బాదుతాను అంతే. జైశ్వాల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంటుంది. అతడు నాకు ఏమి చేయాలో చెప్తాడు. నాలో సానుకూల దృక్పథాన్ని నింపుతాడు. ఐపీఎల లో శతకం చేయడం నా కల. ఆ కల ఈ రోజు నిజమైంది. నాకు ఎలాంటి భయం లేదు. ఎక్కువగా ఆలోచించను. కేవలం పూర్తిగా ఆటపై దృష్టి పెడతాను." అని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.