RR vs DC: రాయల్స్ రచ్చ: రియాన్ పరాగ్ క్లాస్.. ఫెరీరా ఊర మాస్!
RR vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న 43వ మ్యాచ్ హై-స్కోరింగ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. రియాన్ పరాగ్ క్లాస్ ఇన్నింగ్స్.. చివరలో డోనోవన్ ఫెరీరా మాస్ విధ్వంసంతో ఢిల్లీ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ఆరంభం మాత్రం ఆశించిన స్థాయిలో సాగలేదు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే యశస్వి జైస్వాల్, మిచెల్ స్టార్క్ వేసిన తొలి బంతిని సిక్సర్‌గా మలిచినప్పటికీ.. అదే ఓవర్ మూడో బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాత కైల్ జేమిసన్ వేసిన రెండో ఓవర్లో వైభవ్ సూర్యవంశీ (4) ఫోర్‌తో ఖాతా తెరిచినా.. తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ అయి నిరాశపరిచాడు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఆదుకున్నారు.

రియాన్ పరాగ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జురెల్‌తో కలిసి మూడో వికెట్‌కు 102 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ధ్రువ్ జురెల్ (42) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయినప్పటికీ, పరాగ్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఆడాడు. అయితే సెంచరీకి చేరువవుతున్న తరుణంలో, మిచెల్ స్టార్క్ వేసిన 17వ ఓవర్లో రియాన్ పరాగ్ (90) ఔట్ అయ్యాడు. అదే ఓవర్లో రవీంద్ర జడేజా (20) కూడా వికెట్ సమర్పించుకున్నాడు.
రాజస్థాన్ స్కోరు 200 దాటుతుందా అనిపిస్తున్న సమయంలో డోనోవన్ ఫెరీరా శివతాండవం చేశాడు. కేవలం 13 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో విరుచుకుపడి 47 పరుగులు సాధించాడు. డెత్ ఓవర్లలో ఫెరీరా మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయడంతో రాజస్థాన్ స్కోరు బోర్డు ఒక్కసారిగా పరుగెత్తింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 226 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్, కైల్ జేమీసన్, నటరాజన్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications