జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరుగుతోంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
టాస్ గెలిచిన అనంతరం రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. పిచ్ కొంచెం పొడిగా, ప్యాచ్‌లుగా కనిపిస్తోందని.. అందుకే మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. రెండో ఇన్నింగ్స్ సమయానికి వికెట్ నెమ్మదించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గత మ్యాచ్‌లో 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం జట్టులో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, ఈ మ్యాచ్‌లో పూర్తిస్థాయి 40 ఓవర్ల అత్యుత్తమ క్రికెట్ ఆడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ జట్టులో రవి బిష్ణోయ్, శుభమ్ దుబే తుది జట్టులోకి వచ్చారు.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, లక్ష్యాన్ని ఛేదించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. గత వైఫల్యాలను పక్కన పెట్టి బేసిక్స్‌పై దృష్టి సారించడం ముఖ్యమని.. సానుకూల దృక్పథం, బాడీ లాంగ్వేజ్‌తో ఈ మ్యాచ్‌లో పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో మార్పులు అనివార్యమని ఆయన పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ మ్యాచ్ కోసం మూడు కీలక మార్పులు చేసింది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ జట్టులోకి తిరిగి రాగా.. చమీరాకు చోటు దక్కలేదు. అలాగే పాతుమ్ నిస్సంకా తుది జట్టులోకి రావడంతో డేవిడ్ మిల్లర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అశోక్ శర్మకు కూడా తుది జట్టులో అవకాశం లభించింది. హోమ్ గ్రౌండ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు భారీ స్కోరు సాధిస్తారా లేక ఢిల్లీ బౌలర్లు వారిని అడ్డుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తుది జట్లు ఇవే..:
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, కైల్ జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ