సీఏసీ సభ్యుడిగా ఆర్పీ సింగ్.. ఏడాది పాటు పదవీకాలం!!

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా సీనియర్ జట్టు సెలెక్టర్ల ఎంపిక కోసం నూతన క్రికెట్ సలహా మండలిని (సీఏసీ)ని నియమించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం ప్రకటించిన సీఏసీలో టీమిండియా మాజీ ఆటగాడు ఆర్‌పీ సింగ్ (రుద్రప్రతాప్ సింగ్)కు అనూహ్యంగా చోటుదక్కింది. ముగ్గురు సభ్యులు గల కమిటీలో అందరూ అనుకున్నట్లుగానే మదన్ లాల్, సులక్షణ నాయక్ చోటు దక్కించుకున్నారు. వీరికి తోడు కొత్తగా ఆర్పీ సింగ్ ఎంపికయ్యారు.

ఏడాది పాటు పదవీకాలం:
సెలెక్టర్లు ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ కోడా పదవీ కాలం పూర్తి కావడంతో.. వారి స్థానంలో కొత్త వారిని సీఏసీ ఎంపిక చేయనుంది. కొత్త కమిటీ ఏడాది పాటు కొనసాగుతుందని బీసీసీఐ సెక్రటరీ జై షా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత సీఏసీ కమిటీలోని సభ్యులు కపిల్ దేవ్, శాంతా రంగస్వామి, అన్షుమాన్ గైక్వాడ్ విరుద్ధ ప్రయోజనాల ఆరోపణల నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

గంభీర్‌కు నో ఛాన్స్:
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌కు సీఏసీలో చోటివ్వాలని తొలుత బీసీసీఐ ఆలోచించింది. అయితే ప్రస్తుతం గంభీర్ పార్లమెంటు సభ్యుడిగా ఉండడంతో మరలా విరుద్ధ ప్రయోజనాల అంశం తెరలేవనున్న నేపథ్యంలో బీసీసీఐ గంభీర్‌కు సీఏసీలో చోటు ఇవ్వలేదు. దీంతో ఆర్పీ సింగ్‌కు మార్గం సుగమమైంది. మదన్ లాల్, సులక్షణ పేర్లను బీసీసీఐ ఎప్పుడో ఖరారు చేసింది.

ఆరేళ్ల పాటు టీమిండియాకు సేవలు:
ఆర్పీ సింగ్ 2005లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచారు. ఆరేళ్ల పాటు టీమిండియాకు సేవలందించిన ఆర్పీ.. 2011లో చివరి మ్యాచ్ ఆడారు. కొంతకాలం పాటు ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడారు. ఆర్‌పీ సింగ్ భారత్ తరఫున 14 టెస్ట్ మ్యాచ్‌లు (40 వికెట్లు), 58 వన్డేలు (69 వికెట్లు), 10 టీ20 మ్యాచ్ (15 వికెట్లు)లకు ప్రాతినిధ్యం వహించారు.

సీఏసీలో అతి పిన్నవయస్కుడు:
1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన మదన్ లాల్ టీమిండియా తరఫున మొత్తం 39 టెస్టులు (71 వికెట్లు), 67 వన్డేలు (73 వికెట్లు) ఆడారు. గతంలో సెలెక్షన్ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు. భారత మహిళల జట్టు తరఫున మాజీ వికెట్ కీపర్ సులక్షణ నాయక్ 46 వన్డేలు, 31 టీ20లు ఆడారు. సీఏసీలో అతి పిన్న వయసు సభ్యుడు ఆర్పీ సింగ్ (34).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications