కోట్లు పెట్టినా కొంపముంచారు.. RCBకి తప్పని తిప్పలు!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 9 పరుగుల తేడాతో ఓడిపోవడం జట్టును ఇబ్బందుల్లో నెట్టేసింది. ఇది ఆర్సీబీకి వరుసగా రెండో ఓటమి. పాయింట్ల పట్టికలో జట్టు పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నప్పటికీ.. కొంతమంది కీలక ఆటగాళ్ల ఫామ్ జట్టు యాజమాన్యానికి నిద్రలేకుండా చేస్తోంది. ముఖ్యంగా భారీ ఆశలు పెట్టుకున్న జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్ వైఫల్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
జితేష్ శర్మ.. రూ.11 కోట్లు బొక్కా..!
మిడిలార్డర్‌లో మెరుపులు మెరిపిస్తాడని రూ.11 కోట్లకు రీటైన్ చేసుకున్న జితేష్ శర్మ ఈ సీజన్లో పూర్తిగా చేతులెత్తేశాడు. లక్నోతో జరిగిన కీలక మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. గత సీజన్లో 176.35 స్ట్రైక్ రేట్‌తో అదరగొట్టిన జితేష్ శర్మ.. ఈ ఏడాది 10 మ్యాచ్‌ల్లో కేవలం 64 పరుగులు మాత్రమే చేశాడు. జితేష్ స్ట్రైక్ రేట్ (108.47) టీ20 ఫార్మాట్‌కు ఏమాత్రం సరిపోని విధంగా ఉంది. ఫినిషర్‌గా జట్టును గట్టెక్కిస్తాడనుకుంటే, వరుసగా విఫలమవుతూ జట్టును కష్టాల్లోకి నెడుతున్నాడు.

రొమారియో షెపర్డ్.. ఆల్‌రౌండర్ కోటాలో నిరాశే!
మరోవైపు వెస్టిండీస్ పవర్ హిట్టర్ రొమారియో షెపర్డ్ కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. లక్నో జట్టుపై 15 బంతుల్లో 23 పరుగులు చేసినా, జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోయాడు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లలో అతను చేసింది కేవలం 79 పరుగులు మాత్రమే. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ షెపర్డ్ ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. 12.94 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకుంటూ కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. ఓ విదేశీ ఆల్‌రౌండర్ నుంచి ఆశించే స్థాయి ప్రదర్శన ఇది కాదనే చెప్పాలి.
కఠిన నిర్ణయాలు తప్పవా?
ఆర్సీబీ యాజమాన్యం ఈ ఇద్దరు ప్లేయర్లపై పెట్టిన పెట్టుబడికి ఇప్పటివరకు పైసా ఫలితం దక్కలేదు. రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో జట్టు గెలుపు జోరు కొనసాగిస్తుంటే.. ఆర్సీబీ మాత్రం తన సొంత ఆటగాళ్ల ఫామ్ లేమితో సతమతమవుతోంది. టోర్నీలో ఇంకా 4 లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో, ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే జితేష్ శర్మ లేదా షెపర్డ్‌ను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్సీబీ యాజమాన్యం ఆ సాహసం చేస్తుందో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications