
ఆసియాకప్‌లో నిన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా తన 100వ టీ20 మ్యాచ్ ఆడిన భారత స్టార్ విరాట్ కోహ్లీని న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ అభినందించాడు. ఆటలోని మూడు ఫార్మాట్లలో 100మ్యాచ్‌లు ఆడిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లి ఆదివారం నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫామ్ విషయమై చాలా ఆసక్తి ఏర్పడింది. పాకిస్థాన్ భారత్‌కు విధించిన 148 పరుగుల విజయ లక్ష్యం ఛేదనలో కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్ అవుట్ కాగా.. కోహ్లీ రోహిత్‌తో కలిసి కాసేపు ఇన్నింగ్స్ నడిపించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అదృష్టం కూడా బానే ఉంది. అతను రెండో బంతికే స్లిప్‌లో ఫఖర్ జమాన్ చేతికి చిక్కాల్సింది కానీ అతను క్యాచ్ మిస్ చేశాడు. ఇక దీంతో కాసేపు నిలకడగా ఆడిన కోహ్లీ 34 బంతుల్లో 35 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడి ఇండియాను ఐదు వికెట్ల తేడాతో గెలిపించారు.
ఇక కోహ్లీ 100వ టీ20 మ్యాచ్ ఆడిన సందర్భంగా రాస్ టేలర్ అతన్ని అభినందించాడు. 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల క్లబ్‌కు కోహ్లీని టేలర్ స్వాగతించాడు. రాబోయే రోజుల్లో కోహ్లీ మరింత జోరు కనబర్చే ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నట్లు టేలర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. 'కోహ్లీ 100వ టీ20 మ్యాచ్‌కు అభినందనలు. రాబోయే సంవత్సరాల్లో మీ నుంచి మరిన్ని గొప్ప ప్రదర్శనలు రావాలని నేను ఎదురు చూస్తున్నాను' అని టేలర్ ట్వీట్ చేశాడు. ఇకపోతే 100వ టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లికి ఏబీ డివిలియర్స్, ఫాఫ్ డుప్లెసిస్ లాంటి దిగ్గజాలు కూడా శుభాకాంక్షలు తెలిపారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కోహ్లీ, డివిలియర్స్ స్టార్ బ్యాటర్లుగా వెలుగొందిన సంగతి తెలిసిందే.